వైట్ హౌస్‌లో జరిగిన ప్రత్యేక విందు ప్రస్తుతం అమెరికా-సౌదీ సంబంధాలతో పాటు ట్రంప్-ఎలన్ మస్క్ మధ్య ఉన్న పరిస్థితులపై పెద్ద చర్చగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం ఇచ్చిన ఈ డిన్నర్‌కు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో పాటు టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా హాజరయ్యాడు.
ఇద్దరూ కలిసి పబ్లిక్‌గా కనిపించడం చాలా రోజుల తరువాత జరుగుతుండటంతో వారి మధ్య ఉన్న విభేదాలు తగ్గుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గత సంవత్సరంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన భారీ పన్ను, ఖర్చు బిల్లులను మస్క్ బహిరంగంగా విమర్శించిన విషయం అందరికీ తెలిసినదే.
అదేసమయంలో కొత్త రాజకీయ పార్టీ పెడతానని కూడా చెప్పాడు. దీని కారణంగా ట్రంప్ కోపంతో మస్క్ కంపెనీలు ప్రభుత్వ సాయం పొందకుండా చూస్తానని హెచ్చరించాడు. ఈ తగాదా టెస్లా ఇమేజ్ అమ్మకాలపై కూడా ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు మస్క్ ఈ విందుకు రావడం ఇద్దరి మధ్య తిరిగి సర్దుబాటు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సమావేశానికి పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, ఎన్వీడియా CEO జెన్సెన్ హువాంగ్ వంటి మరో కొన్ని ప్రముఖులు కూడా హాజరయ్యారు.
సౌదీ ప్రిన్స్ ప్రస్తుతం తన ఇమేజ్ మెరుగుపరుచుకునేందుకు అమెరికాతో సంబంధాలు బలపరచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయం కావడంతో ఈ డిన్నర్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.ఇంతకుముందు మస్క్ ట్రంప్‌ను సెప్టెంబర్‌లో జరిగిన ఒక ఈవెంట్లో మాత్రమే కలిశాడు.
ఆ తర్వాత ఇప్పుడు వైట్ హౌస్ డిన్నర్లో మళ్ళీ కలిసి కనిపించడం రాజకీయంగా కూడా కొత్త సందేశం ఇస్తుందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. సాంకేతిక రంగం, రాజకీయ రంగం, అంతర్జాతీయ సంబంధాలు అని ఒకేచోట కలిసిన ఈ డిన్నర్ భవిష్యత్తులో అమెరికా విధానాలపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.