⚡ BREAKING
Education

LEAP: ఇంటర్నేషనల్ స్కూల్ ను తలపిస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్.. నిడమర్రు బడి అదుర్స్!

LEAP: మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని గ్రామమైన నిడమర్రు జెడ్పీ హైస్కూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో రూ. 16 కోట్లతో అంతర్జాతీయ స్థాయి మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దారు. 5.02 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ బడిలో 28 తరగతి గదులు, డిజిటల్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్, క్రీడా మైదానాలు, ఇండోర్ స్టేడియం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు.

ఇంటర్నేషనల్ స్కూల్ ను తలపిస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్
ఇంటర్నేషనల్ స్కూల్ ను తలపిస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్
  • ఒక్క సీటుకు 15 మంది పోటీ.. నిడమర్రు ప్రభుత్వ పాఠశాలకు మామూలు క్రేజ్ లేదు!
  • 16 కోట్లతో నిడమర్రు బడికి మహర్దశ: మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ.
  • సర్కారు బడిలో డిజిటల్ ల్యాబ్స్, సీసీ కెమెరాలు.. నిడమర్రు ప్రాంగణంలో అద్భుతం

LEAP: ఒకప్పుడు పిల్లలు బాగా చదువుకుంటేనే ప్రభుత్వ బడిలో సీటు దొరికేది, సరిగ్గా చదువుకోకపోతే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చేది. కానీ కాలక్రమంలో ఆ పరిస్థితి మారిపోయి, చదువుకోవాలంటే ప్రైవేట్ లేదా కార్పొరేట్ స్కూల్ కే వెళ్లాలి అనే పరిస్థితి వచ్చింది. అయితే ఆ పాత రోజులను మళ్లీ వెనక్కి తెస్తూ, ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా, ఇంకా చెప్పాలంటే వాటికంటే అద్భుతంగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని గ్రామమైన నిడమర్రులో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ ఇందుకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో ఈ సర్కారు బడి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ను తలపించేలా, అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాటైన మొట్టమొదటి మోడల్ స్కూల్‌గా రూపుదిద్దుకుంది.

గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు సైతం ప్రభుత్వ పాఠశాలల్లోనే కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా, ఏకంగా 16 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ స్కూల్‌ను అభివృద్ధి చేశారు. 5.02 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ (CBSE) సిలబస్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు డిజిటల్ లెర్నింగ్ వేదికగా మారిన ఈ బడిలో, గత ఏడాది కేవలం 510 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరానికి ఏకంగా 1100 కు చేరుకుంది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు ప్రాంతాల నుంచి ఇక్కడ అడ్మిషన్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది, ఒక్కో సీటుకు సుమారు 15 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారంటే ఈ ప్రభుత్వ స్కూల్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విద్యా ప్రమాణాలను పెంచడానికి ఈ మోడల్ స్కూల్లో ఆధునిక మౌలిక వసతులు కల్పించారు. పాఠశాల భవనాన్ని ఇంగ్లీష్ అక్షరం 'U' ఆకారంలో రెండు అంతస్తుల్లో అందంగా నిర్మించారు, పైకి వెళ్లడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. భవనం నడుమ అందమైన కళావేదికను నిర్మించడంతో పాటు, భద్రతకు పెద్ద పీట వేస్తూ క్యాంపస్ అంతటా 40 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. మొత్తం 28 విశాలమైన తరగతి గదులతో పాటు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి కంప్యూటర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ నైపుణ్యాలను పెంపొందించే 'అటల్ టింకరింగ్ ల్యాబ్' ను కూడా ఇక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేశారు.

కేవలం చదువే కాకుండా విద్యార్థుల క్రీడలు, మానసిక వికాసానికి ఈ ప్రాంగణంలో విశేష ప్రాధాన్యత ఇచ్చారు. ప్రవేశ ద్వారానికి కుడివైపున పచ్చిక బయలుతో కూడిన ఏడు రకాల క్రీడా పరికరాలు ఉన్న చిల్డ్రన్ పార్క్ ఉంది. స్కూల్ మధ్యలో ఫుట్ బాల్ మరియు క్రికెట్ ఆడుకోవడానికి అనువైన భారీ మైదానం ఉండగా, దాని చుట్టూ 200 మీటర్ల రన్నింగ్ మరియు వాకింగ్ ట్రాక్ అద్భుతంగా నిర్మించారు. బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఆడుకోవడానికి 400 మంది వీక్షించేలా ఒక ఇండోర్ స్టేడియం, క్రికెట్ ప్రాక్టీస్ కోసం నెట్స్, ఓపెన్ జిమ్, ఎడమ వైపు అందమైన బాటలో ఓపెన్ యాంఫీ థియేటర్ వంటి అద్భుతమైన సదుపాయాలు ఇక్కడ కల్పించారు.

వీటన్నింటితో పాటు 400 మంది విద్యార్థులు ఒకేసారి కూర్చుని తినేలా ఒక పెద్ద డైనింగ్ హాల్‌, ఉపాధ్యాయులకు స్టాఫ్ రూమ్స్ కూడా నిర్మించారు. ఇన్ని హంగులు చూస్తుంటే చదువుపై ఆసక్తి లేని పిల్లలకు సైతం రోజూ బడికి వెళ్లాలని అనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నది మంత్రి లోకేష్ ప్రణాళిక కాగా, తొలి దశలో ఏర్పాటు చేయనున్న 40 మోడల్ స్కూల్స్‌కు ఈ నిడమర్రు జెడ్పీ హైస్కూల్‌ను ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నారు. ఈ పాఠశాల భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయి విద్యార్థులకు స్వాగతం పలుకుతోంది, ఇలాంటి మోడల్ స్కూల్స్ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులు సర్కారు బడుల్లోనే అత్యుత్తమ ఇంగ్లీష్ విద్యను అభ్యసించగలుగుతారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags

Be the first to react

More Coverage