Manas Sarovar Yatra: 2026 కైలాస మానససరోవర యాత్రకు ప్రత్యేకత.. 60 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన 'ఫైర్ హార్స్ ఇయర్'!

Manas Sarovar Yatra: హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో కైలాస మానససరోవర యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే 2026లో ఈ యాత్రకు మరింత విశిష్టత ఏర్పడింది. టిబెటన్, బౌద్ధ సంప్రదాయాల ప్రకారం ఇది పవిత్రమైన 'హార్స్ ఇయర్'. ఈ సంవత్సరం ప్రతి 12 ఏళ్లకోసారి మాత్రమే వస్తుంది. అంతేకాదు, ఈసారి 'ఫైర్ హార్స్ ఇయర్' కూడా కావడం మరింత విశేషం.

Manas Sarovar Yatra
Manas Sarovar Yatra

హార్స్ ఇయర్ – ఫైర్ హార్స్ ఇయర్ కలయికతో ప్రత్యేకమైన కైలాస యాత్ర..

2026 కైలాస యాత్ర ఎందుకు అంత ప్రత్యేకం? భక్తుల్లో పెరిగిన ఆధ్యాత్మిక విశ్వాసం..

హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో కైలాస మానససరోవర యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే 2026లో ఈ యాత్రకు మరింత విశిష్టత ఏర్పడింది. టిబెటన్, బౌద్ధ సంప్రదాయాల ప్రకారం ఇది పవిత్రమైన 'హార్స్ ఇయర్'. ఈ సంవత్సరం ప్రతి 12 ఏళ్లకోసారి మాత్రమే వస్తుంది. అంతేకాదు, ఈసారి 'ఫైర్ హార్స్ ఇయర్' కూడా కావడం మరింత విశేషం. ఈ అరుదైన సంయోగం ప్రతి 60 ఏళ్లకోసారి మాత్రమే వస్తుందని విశ్వసిస్తారు.

ఈ కారణంగా కైలాస పర్వతం, మానససరోవరం పరిసరాల్లో ఆధ్యాత్మిక శక్తి అత్యున్నత స్థాయిలో ఉంటుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ ఏడాది కైలాస యాత్రను చాలామంది "కైలాస మహాకుంభం" తో పోలుస్తున్నారు.

కైలాస పర్వతం, మానససరోవరం చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లో ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి.

హిందూ సంప్రదాయం ప్రకారం కైలాస పర్వతం పరమశివుడు, పార్వతీ దేవి శాశ్వత నివాసంగా భావిస్తారు. బౌద్ధులు దీనిని కాంగ్ రిన్పోచే (అమూల్యమైన మంచు రత్నం)గా పూజిస్తారు. జైన మత విశ్వాసం ప్రకారం తొలి తీర్థంకరుడు ఋషభదేవుడు ఇక్కడే మోక్షం పొందారు. ప్రాచీన బోన్ మతం అనుసరించే వారు దీనిని విశ్వానికి ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు.

ఈ యాత్రలో భక్తులు కైలాస పర్వతాన్ని అధిరోహించరు. దూరం నుంచే ప్రార్థనలు చేసి, పర్వతం చుట్టూ సుమారు 52 కిలోమీటర్ల కైలాస పరిక్రమ (కోరా)ను పూర్తి చేస్తారు.

2026 టిబెటన్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హార్స్ ఇయర్. టిబెటన్ రాశిచక్రంలో 12 జంతువులు వరుసగా వస్తుంటాయి. అందులో గుర్రం ధైర్యం, స్వేచ్ఛ, శక్తి, సంకల్పం, ఆధ్యాత్మిక పురోగతికి ప్రతీకగా భావిస్తారు. కైలాస పర్వతం విశ్వానికి కేంద్రబిందువుగా భావించే టిబెటన్ విశ్వాసాల ప్రకారం హార్స్ ఇయర్లో కైలాస దర్శనం అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది. గత హార్స్ ఇయర్ 2014లో రాగా, తదుపరి హార్స్ ఇయర్ కోసం భక్తులు 2038 వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ప్రతి జంతువు ఐదు ప్రకృతి మూలకాలైన చెక్క, అగ్ని, భూమి, లోహం, నీటిలో ఒకదానితో కలుస్తుంది. ఈ చక్రం కారణంగా ఫైర్ హార్స్ ఇయర్ ప్రతి 60 ఏళ్లకోసారి మాత్రమే వస్తుంది.

టిబెటన్, చైనా జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం అగ్ని పవిత్రత, మార్పు, కొత్త ఆరంభాలకు సంకేతం. గుర్రం స్వేచ్ఛ, చైతన్యం, ధైర్యానికి ప్రతీక. ఈ రెండూ కలిసిన కాలంలో ఆధ్యాత్మిక పురోగతి మరింత శక్తివంతంగా ఉంటుందని విశ్వసిస్తారు.

కైలాస యాత్రలో ప్రధాన ఘట్టమైన 52 కిలోమీటర్ల కైలాస పరిక్రమను పూర్తి చేయడానికి సాధారణంగా మూడు రోజులు పడుతుంది. టిబెటన్ బౌద్ధ సంప్రదాయం ప్రకారం హార్స్ ఇయర్లో ఒకసారి పరిక్రమ పూర్తి చేస్తే, సాధారణ సంవత్సరంలో 13 సార్లు చేసినంత పుణ్యం లభిస్తుందని విశ్వాసం. అంటే ఈ ఏడాది ఆధ్యాత్మిక ఫలితం 13 రెట్లు అధికంగా ఉంటుందని భక్తులు నమ్ముతున్నారు.

సముద్ర మట్టానికి సుమారు 4,590 మీటర్ల ఎత్తులో ఉన్న మానససరోవరం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సుల్లో ఒకటి. ఫైర్ హార్స్ ఇయర్లో ఈ సరస్సులో పవిత్ర స్నానం చేస్తే గత జన్మల కర్మల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే హార్స్ ఇయర్, ప్రతి 60 ఏళ్లకు ఒకసారి వచ్చే ఫైర్ హార్స్ ఇయర్ రెండూ ఒకేసారి రావడం వల్ల 2026 కైలాస మానససరోవర యాత్ర అత్యంత అరుదైనదిగా, ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యం సంతరించుకున్నదిగా భావిస్తున్నారు.

Tags

Be the first to react

Latest