ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పలు కీలక చర్యలు చేపడుతోంది. చదువు, అర్హత, నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి, స్థానికంగానే లేదా ఇంటి నుంచే పని చేసే అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల కోసం ‘కౌశలం’ అనే కార్యక్రమాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి నిరుద్యోగుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. బీటెక్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఐటీఐ వంటి వివిధ విద్యార్హతలు కలిగిన యువత ఈ సర్వేలో పాల్గొన్నారు.
కౌశలం సర్వేలో పాల్గొన్న అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను సైతం సేకరించి, వాటిని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం అర్హులైన అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో కౌశల పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో విడత పరీక్షలు ఈ నెల 15 నుంచి 19 తేదీల వరకు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన వివరాలను అభ్యర్థులకు మెసేజ్‌ల రూపంలో పంపిస్తున్నారు. సమాచారం అందుకున్న అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరవుతున్నారు.
అయితే, కొన్ని కారణాల వల్ల కొందరు అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాలేకపోయారు. ముఖ్యంగా స్థానికంగా లేని వారు, అనివార్య కారణాలతో రాలేని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. వారికి ప్రత్యేకంగా పంపిన లింక్ ఆధారంగా పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ కౌశల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటి నుంచే పని చేసే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను కేటాయించనున్నారు. సర్వేలో వివరాలు అందజేసిన వారికి మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్ష తేదీ, సమయం తదితర వివరాలను అభ్యర్థులకు ముందుగానే మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు.
కౌశలం ఆన్‌లైన్ పరీక్షలు ప్రతిరోజూ పరిమిత సంఖ్యలో అభ్యర్థులకు నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం పరీక్ష వ్యవధి 60 నిమిషాలు కాగా, ఇందులో 45 నిమిషాలు స్కిల్ అసెస్‌మెంట్‌కు, 15 నిమిషాలు కమ్యూనికేషన్ స్కిల్ అసెస్‌మెంట్‌కు కేటాయించారు. పరీక్ష సమయంలో అభ్యర్థి ఉన్న ప్రదేశాన్ని నిర్ధారించేందుకు లైవ్ లొకేషన్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. పరీక్ష జరుగుతున్న సమయంలో కెమెరాలో అభ్యర్థి తప్ప మరెవరైనా కనిపిస్తే అనర్హత విధిస్తారు. పరీక్ష అనంతరం రెండు కేటగిరీల్లో మూల్యాంకనం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో సర్వర్ సమస్యలు ఎదురైనప్పటికీ, మొత్తం మీద కౌశలం వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.