⚡ BREAKING

UPI యూజర్ లకు ప్రభుత్వం తీపి కబురు.. చార్జీల అమలు జనవరి కి వాయిదా?

UPI MDR Charges: యూపీఐ ద్వారా జరిగే కొన్ని వ్యాపార చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే నిర్ణయంపై వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అక్టోబర్ 15, 2026 నుంచి రూ.2,000కు మించిన ఎంపిక చేసిన పర్సన్-టు-మర్చంట్ (P2M) యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం MDR అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు MDR గరిష్ఠంగా రూ.300కు పరిమితం కానుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే UPI చెల్లింపులు, రూ.2,000 వరకు ఉన్న అర్హత కలిగిన మర్చంట్ లావాదేవీలు ఈ ఛార్జీ పరిధిలోకి రావు.

UPI MDR Charges
UPI MDR Charges

UPI MDR అంటే ఏమిటి? రూ.2,000, రూ.10,000 చెల్లింపులపై ఎంత ఛార్జీ?..

UPI చెల్లింపులపై కొత్త ఛార్జీలు.. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలకు ఇంకా స్పష్టత కరవు..

న్యూఢిల్లీ: యూపీఐ ద్వారా జరిగే కొన్ని వ్యాపార చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే నిర్ణయంపై వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అక్టోబర్ 15, 2026 నుంచి రూ.2,000కు మించిన ఎంపిక చేసిన పర్సన్-టు-మర్చంట్ (P2M) యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం MDR అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు MDR గరిష్ఠంగా రూ.300కు పరిమితం కానుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే UPI చెల్లింపులు, రూ.2,000 వరకు ఉన్న అర్హత కలిగిన మర్చంట్ లావాదేవీలు ఈ ఛార్జీ పరిధిలోకి రావు.

అయితే ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా పలు వ్యాపార సంఘాలు, చిన్న వర్తకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సీజన్ సమీపిస్తున్న సమయంలో కొత్త ఛార్జీలను అమలు చేస్తే వ్యాపారాలపై అదనపు ఖర్చు భారం పడుతుందని వారు చెబుతున్నారు. అందుకే MDR అమలును తాత్కాలికంగా వాయిదా వేసి, కనీసం వచ్చే ఏడాది వరకు సమయం ఇవ్వాలని వ్యాపార, ఫిన్‌టెక్ సంస్థలు కోరుతున్నాయి.

పండుగ సీజన్ నేపథ్యంలో వాయిదా డిమాండ్

వ్యాపార సంఘాలు, ఫిన్‌టెక్ సంస్థలు MDR అమలును పండుగ సీజన్ ముగిసే వరకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. వేర్వేరు లావాదేవీలకు వేర్వేరు MDR రేట్లు, నిబంధనలు ఉండటంతో వ్యవస్థలో ఇంకా కొంత గందరగోళం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దేశంలో కొనుగోళ్లు, డిజిటల్ చెల్లింపులు పెరిగే అవకాశం ఉండటంతో ఈ సమయంలో కొత్త విధానాన్ని అమలు చేయడం వ్యాపారులకు ఇబ్బందిగా మారవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.

MDR అమలుపై ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంబంధిత వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. NPCI కూడా వ్యాపారులు, ఫిన్‌టెక్ సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తుది నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం ఉంది. తాజా నివేదికల ప్రకారం అక్టోబర్ 15న ప్రారంభం కావాల్సిన MDR అమలును 2027 జనవరి వరకు వాయిదా వేసే అంశం పరిశీలనలో ఉంది. అయితే తుది నిర్ణయం NPCI తీసుకోవాల్సి ఉంది.

రూ.2,000 దాటితే 0.4 శాతం MDR

ప్రస్తుతం ప్రకటించిన విధానం ప్రకారం రూ.2,000కు మించిన అర్హత కలిగిన మర్చంట్ UPI లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.2,000 చెల్లింపుపై రూ.8 MDR, రూ.10,000 చెల్లింపుపై రూ.40 MDR అవుతుంది. రూ.75,000 లావాదేవీకి 0.4 శాతం ప్రకారం రూ.300 వస్తుంది. అంతకంటే ఎక్కువ మొత్తానికి కూడా గరిష్ఠంగా రూ.300 మాత్రమే MDRగా వర్తిస్తుంది.

ఇక్కడ MDR అనేది నేరుగా వినియోగదారుడిపై విధించే UPI ఛార్జీ కాదు. ప్రస్తుతం ప్రకటించిన నిబంధనల ప్రకారం ఈ రుసుము మర్చంట్ లేదా సంబంధిత పేమెంట్ వ్యవస్థపై ఉంటుంది. వినియోగదారుల నుంచి దీనిని నేరుగా వసూలు చేయకూడదని బ్యాంకులకు సూచనలు ఉన్నాయి.

వ్యాపార ఖర్చులు పెరుగుతాయన్న ఆందోళన

ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా వ్యాపార నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డిజిటల్ చెల్లింపులపై అదనపు MDR భారం పడితే చిన్న వ్యాపారాల లాభాలపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ మార్జిన్‌తో పనిచేసే MSMEలు, రిటైల్ వ్యాపారాలకు ఇది అదనపు ఒత్తిడిగా మారవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

MDRను నేరుగా వినియోగదారుడి నుంచి వసూలు చేయడానికి అనుమతి లేకపోయినప్పటికీ, వ్యాపారులు తమ ఇతర ఖర్చులను సర్దుబాటు చేసుకునే క్రమంలో వస్తువులు, సేవల ధరలను పెంచే అవకాశం ఉందని కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో చివరికి ఆర్థిక భారం పరోక్షంగా వినియోగదారుడిపై పడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.

కార్డుల కంటే UPI విధానం ఎందుకు క్లిష్టం?

వ్యాపార వర్గాల మరో ప్రధాన అభ్యంతరం UPIలోని లావాదేవీల వర్గీకరణకు సంబంధించినది. కార్డు చెల్లింపులతో పోలిస్తే UPIలో యుటిలిటీ బిల్లులు, రుణ చెల్లింపులు, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు వంటి విభిన్న రకాల చెల్లింపులకు ప్రత్యేక నిబంధనలు, రేట్లు ఉండటంతో వ్యవస్థ మరింత క్లిష్టంగా మారిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

లోన్ రీపేమెంట్లు, బ్రోకింగ్ ఖాతాల్లోకి నిధుల బదిలీ వంటి కొన్ని లావాదేవీలకు క్రెడిట్ కార్డులను రిజర్వ్ బ్యాంక్ అనుమతించని పరిస్థితుల్లో, UPI ద్వారా జరిగే ఇటువంటి ప్రత్యేక చెల్లింపులను MDR విధానంలో ఏ విధంగా వర్గీకరించాలన్న దానిపై ఇంకా స్పష్టత అవసరమని బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు పేర్కొంటున్నాయి.

ఆటోపే విఫలమైతే ఏ నిబంధనలు?

ఆటోపే లావాదేవీ విఫలమైన తర్వాత వినియోగదారు మాన్యువల్‌గా చెల్లింపు చేస్తే దానికి ఏ MDR నిబంధనలు వర్తిస్తాయి? ప్రత్యేక లావాదేవీలను ఏ కేటగిరీలోకి చేర్చాలి? వంటి అంశాలపై కూడా బ్యాంకులు, పేమెంట్ సంస్థలకు మరింత స్పష్టత అవసరమని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

ఈ సాంకేతిక, విధానపరమైన సందేహాలను పరిష్కరించడానికి తగిన సమయం అవసరమని వారు అంటున్నారు. ముఖ్యంగా పండుగల సీజన్‌లో దేశవ్యాప్తంగా UPI వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, వ్యవస్థలను పరీక్షించేందుకు, వ్యాపారులకు మార్గదర్శకాలు ఇవ్వడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.

క్యాపిటల్ మార్కెట్ సంస్థలకూ ఆందోళన

బ్రోకింగ్ సంస్థలపై కూడా MDR భారం పడకూడదని క్యాపిటల్ మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. వివిధ రకాల ఆర్థిక లావాదేవీలకు ఒకే విధమైన ఛార్జీ విధానం వర్తింపజేయడం కంటే, వాటి స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని సూచిస్తున్నాయి.

ప్రస్తుతం పరిశ్రమ వర్గాల ప్రధాన డిమాండ్ ఒక్కటే. కొత్త MDR విధానాన్ని వెంటనే అమలు చేయకుండా కొంతకాలం వాయిదా వేసి, వ్యాపారులు, బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు, ఫిన్‌టెక్ సంస్థలు కలిసి పెండింగ్‌లో ఉన్న అంశాలపై స్పష్టతకు రావాలని కోరుతున్నాయి.

NPCI ఈ అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలించి త్వరలో తుది నిర్ణయం వెల్లడిస్తుందని బ్యాంకులు, పేమెంట్ సంస్థలు ఆశిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అక్టోబర్ 15, 2026 అమలు తేదీకి సంబంధించి తుది మార్పు అధికారికంగా ఖరారు కాలేదు. అందువల్ల NPCI నుంచి వచ్చే అధికారిక ప్రకటనపై వ్యాపారులు, పేమెంట్ సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Tags

Be the first to react

Latest