బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె.. నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్‌కు బ్రేక్..
Bank Strike on December 3: ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నాయి. బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి ఉన్న వాటాలను విక్రయించి, యాజమాన్య నియంత్రణను విదేశీ ప్రైవేటు సంస్థకు అప్పగించాలన్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 3న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు మద్దతుగా పలు జాతీయ స్థాయి బ్యాంకు సంఘాలు కూడా ముందుకొచ్చాయి. దీంతో డిసెంబర్ 3న బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
డిసెంబర్ 3న దేశవ్యాప్త బ్యాంకు సమ్మె.. ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన..
ఐడీబీఐ బ్యాంకు వాటాల విక్రయానికి వ్యతిరేకంగా ఉద్యమం.. నవంబర్ 25 నుంచే నిరసనలు..
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నాయి. బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి ఉన్న వాటాలను విక్రయించి, యాజమాన్య నియంత్రణను విదేశీ ప్రైవేటు సంస్థకు అప్పగించాలన్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 3న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు మద్దతుగా పలు జాతీయ స్థాయి బ్యాంకు సంఘాలు కూడా ముందుకొచ్చాయి. దీంతో డిసెంబర్ 3న బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాల విక్రయానికి ఆమోదం
ఐడీబీఐ బ్యాంకు వాటాల విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అక్టోబర్ 14న విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 30.48 శాతం వాటా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు ఉన్న 30.24 శాతం వాటా కలిపి మొత్తం 60.72 శాతం వాటాను విక్రయించేందుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (CCEA) ఆమోదం తెలిపింది. ఈ విక్రయం ద్వారా బ్యాంకు యాజమాన్య నియంత్రణను కొత్త వ్యూహాత్మక కొనుగోలుదారుకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కొనుగోలు ప్రక్రియలో కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అనుబంధ సంస్థ కెనడా ఇంక్. రూ.52,878.08 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. ఒక్కో షేరుకు రూ.81 చొప్పున ఇచ్చిన ఈ బిడ్‌ను పరిశీలించిన అనంతరం ఆ సంస్థను వ్యూహాత్మక కొనుగోలుదారుగా ఎంపిక చేశారు. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద 15 శాతం, ఎల్ఐసీ వద్ద 19 శాతం వాటాలు మిగిలి ఉంటాయి. అయితే, కొనుగోలుదారుకు యాజమాన్య నియంత్రణ బదిలీ కావాలంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్వహించే పరిశీలన, అవసరమైన నియంత్రణపరమైన అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే విక్రయ లావాదేవీ తుది దశకు చేరుకుంటుంది.
లాభాల్లో ఉన్న బ్యాంకును ఎందుకు విక్రయించాలి?
ఐడీబీఐ బ్యాంకును విదేశీ ప్రైవేటు సంస్థకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. లాభాల్లో కొనసాగుతున్న బ్యాంకును ప్రైవేటు సంస్థకు విక్రయించడం దేశ ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలం కాదని యూనియన్లు వాదిస్తున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజలకు అందిస్తున్న సేవలు, ఉద్యోగుల భద్రత, బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ పాత్ర వంటి అంశాలపై ఈ విక్రయం ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు మద్దతుగా అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (AIBEA), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) తమ సభ్యులు సమ్మెలో పాల్గొనాలని కోరాయి. ఈ సంఘాల మద్దతుతో డిసెంబర్ 3న జరిగే సమ్మె దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
నవంబర్ 25 నుంచి నిరసన కార్యక్రమాలు
సమ్మెకు ముందు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు దశలవారీగా నిరసన కార్యక్రమాలను ప్రకటించాయి. నవంబర్ 25న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నారు. నవంబర్ 27న ఉద్యోగులు, అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు. నవంబర్ 28న సోషల్ మీడియా వేదికగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. నవంబర్ 30న కేంద్ర ఆర్థిక మంత్రికి సామూహిక వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ మేరకు సమ్మె నోటీసును ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), ఆర్థిక సేవల విభాగం (DFS)కు అందజేశారు.
డిసెంబర్ 3న బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఉంటుందా?
బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 3న సమ్మె జరిగితే కొన్ని బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సమ్మెలో పాల్గొనే బ్యాంకుల శాఖల్లో నగదు డిపాజిట్లు, నగదు ఉపసంహరణలు, చెక్కుల క్లియరెన్స్ వంటి ప్రత్యక్ష సేవలు ఆలస్యమవ్వవచ్చు. అయితే అన్ని బ్యాంకుల శాఖల్లో ఒకే స్థాయిలో ప్రభావం ఉంటుందని చెప్పలేం. ఉద్యోగుల సమ్మెకు మద్దతు, సిబ్బంది హాజరు, ఆయా బ్యాంకులు తీసుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను బట్టి సేవలపై ప్రభావం ఆధారపడి ఉంటుంది.
మరోవైపు ఏటీఎంలు, యూపీఐ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగానే కొనసాగేందుకు అవకాశముంది. అయినప్పటికీ డిసెంబర్ 3న బ్యాంకు శాఖలకు వెళ్లి అత్యవసర లావాదేవీలు నిర్వహించాల్సిన ఖాతాదారులు ముందుగానే తమ పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ఐడీబీఐ బ్యాంకు వాటాల విక్రయంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, ఉద్యోగ సంఘాల వ్యతిరేకత మధ్య నెలకొన్న ఈ పరిణామాలు రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.
Tags
Be the first to react