గోదావరి పుష్కరాలకు ప్రధాని మోదీ.. కుంభమేళా తరహాలో ఏర్పాట్లు..
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచే భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈసారి దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కరాలకు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధి నుంచి రవాణా, వసతి, భద్రత వరకు అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా..
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు.. జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహణ..
గోదావరి పుష్కరాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచే భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈసారి దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కరాలకు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధి నుంచి రవాణా, వసతి, భద్రత వరకు అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
పుష్కరాల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా రాజమహేంద్రవరం, గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధి కోసం రూ.904 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తులందరూ ఒకే ఘాట్‌కు చేరుకుని స్నానాలు చేయాల్సిన అవసరం లేకుండా, గోదావరి నదిలో అనువైన ప్రాంతాల్లో కూడా పుష్కర స్నానాలు చేయవచ్చనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. దీనివల్ల ప్రధాన ఘాట్ల వద్ద రద్దీని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయినప్పటికీ భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మరో నాలుగు కొత్త ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. యాత్రికుల బస కోసం అవసరమైన ఏర్పాట్లపైనా చర్చించారు. తాత్కాలిక వసతి కల్పించేందుకు టెంట్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రాజమహేంద్రవరం నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా భారీగా నిధులు ప్రతిపాదించారు. నగర కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రహదారులు, వంతెనల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం నగర సుందరీకరణ, ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్టు కోసం మరో రూ.75 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.
ఇప్పటికే ప్రారంభించిన పుష్కరాల సంబంధిత పనులన్నింటినీ 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను స్పష్టం చేశారు. పుష్కరాల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక రోజు పాల్గొననున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిర్వహణను మరింత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహా కుంభమేళా నిర్వహణలో అనుసరించిన ఉత్తమ విధానాలను గోదావరి పుష్కరాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది.
భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేయడం, ఘాట్ల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించడం, రవాణా వ్యవస్థను క్రమబద్ధీకరించడం, అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వంటి అంశాల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే శాఖ కూడా పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతోంది. ఆర్టీసీ సైతం భక్తుల రాకపోకలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది.
విమాన మార్గంలో వచ్చే యాత్రికులకు రాష్ట్రంలో మంచి స్వాగతం లభించేలా విజయవాడ, రాజమహేంద్రవరం, భోగాపురం విమానాశ్రయాలను సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి పుష్కర స్నానం పూర్తయ్యే వరకు సౌకర్యవంతమైన అనుభవం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మొత్తం మీద 2027 గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Be the first to react