ఏపీ మద్యం షాపుల్లో కొత్త రూల్.. ఇక బాటిల్ స్కాన్ తప్పనిసరి

Bottle Scanning System: ఏపీలో మద్యం విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, ధరల విషయంలో పారదర్శకత తీసుకురావడమే బాటిల్ స్కానింగ్ విధానం ప్రధాన ఉద్దేశం. ప్రతి బాటిల్ స్కాన్ చేసిన తర్వాతే అమ్మకం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

andhra pradesh government plans to introduce bottle scanning system in liquor shops
andhra pradesh government plans to introduce bottle scanning system in liquor shops
  • ఏపీలో మందుబాబులకు కొత్త విధానం.. ధరలపై క్లారిటీ!

  • మద్యం షాపుల్లో స్కానింగ్ మెషిన్లు.. అక్రమాలకు చెక్?

  • ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకే.. ఏపీలో కొత్త మద్యం విధానం!

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విక్రయాల్లో పారదర్శకత పెంచేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో బాటిల్ స్కానింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. సూపర్ మార్కెట్లలో వస్తువులను బార్‌కోడ్ ద్వారా స్కాన్ చేసి విక్రయించినట్లుగానే మద్యం బాటిళ్లను కూడా స్కాన్ చేసిన తర్వాతే విక్రయించనున్నారు.

స్కాన్ చేస్తే ధర వివరాలు స్పష్టం

కొత్త విధానంలో ప్రతి మద్యం బాటిల్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్కానింగ్ మెషిన్‌తో స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన వెంటనే ఆ బాటిల్ ధర, ఇతర వివరాలు మెషిన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. అంతేకాకుండా స్పీకర్ ద్వారా ధర వినియోగదారులకు వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించే అవకాశాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే

మద్యం దుకాణాలు సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయి. కొత్త స్కానింగ్ మెషిన్లు కూడా ఇదే సమయాల్లో పనిచేసేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నట్లు సమాచారం. రాత్రి 10 గంటలకు మెషిన్లు ఆటోమేటిక్‌గా ఆగిపోయి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తిరిగి పనిచేయనున్నాయి. దీంతో నిర్ణీత సమయాలకు మించి మద్యం విక్రయాలను నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అక్రమ విక్రయాలకు చెక్.. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు

ఈ విధానం అమల్లోకి వస్తే ప్రతి మద్యం బాటిల్ విక్రయానికి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి రియల్‌టైమ్‌లో అందుబాటులో ఉంటాయి. ఏ షాపులో ఎంత మద్యం విక్రయించారు? ఇంకా ఎంత స్టాక్ మిగిలి ఉంది? అనే వివరాలను అధికారులు పర్యవేక్షించవచ్చు. బాటిళ్లను స్కాన్ చేయకుండా విక్రయిస్తే షాపు నిర్వాహకులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘన జరిగితే ఎక్సైజ్ శాఖ జరిమానాలు విధించే అవకాశం ఉంది.

స్కానింగ్ మెషిన్ల అద్దెపై వ్యాపారుల అభ్యంతరాలు

రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు స్కానింగ్ మెషిన్లను సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. ఈ మెషిన్లకు దుకాణాల నిర్వాహకులు నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ అదనపు అద్దె తమపై ఆర్థిక భారంగా మారుతుందని కొందరు వ్యాపారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. గతంలోనూ ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో అమలు కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఈసారి కొత్త విధానం ఎంత సమర్థంగా అమలవుతుందో చూడాలి.

Tags

Be the first to react

Latest