బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... డిసెంబర్ 2, 3 నాటికి తుఫానుగా మారే ఛాన్స్

Weather Update: దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 28–29 తేదీల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి, నవంబర్ 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది డిసెంబర్ 2–3 నాటికి వాయుగుండం లేదా తుఫానుగా బలపడి శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు కదిలే ఛాన్స్ ఉండగా—డిసెంబర్ 1 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • ఏపీకి వరుసగా రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ!.. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన!

  • బుధవారం పామూరులో 74.87 మి.మీ., అల్లంపాడులో 55.5 మి.మీ. భారీ వర్షం!.. నేడు 10 జిల్లాల్లో మోస్తరు వానలు!

  • ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం!.. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత – తాజా వెదర్ అప్‌డేట్స్ ఇవే!

Environment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెలాఖరు మరియు వచ్చే నెల రెండో వారంలో వరుసగా రాష్ట్రానికి రెండు తుఫాన్లు పొంచి ఉన్నాయని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. తాజా అంచనాల ప్రకారం దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 28 లేదా 29వ తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఆవరించనుండగా, దీని ప్రభావంతో నవంబర్ 30వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం పశ్చిమంగా పయనిస్తూ డిసెంబర్ 2 లేదా 3వ తేదీకల్లా వాయుగుండం లేదా తుఫానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించిన అనంతరం శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం భారీ వర్షాలు – పామూరులో 74.87 మి.మీ. నమోదు

ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో సముద్రం నుంచి కోస్తా, రాయలసీమలపైకి తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయి. దీని కారణంగా బుధవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మార్కాపురం జిల్లా పామూరులో 74.87 మి.మీ., నెల్లూరు జిల్లా అల్లంపాడులో 55.5 మి.మీ., గూడూరులో 51.25 మి.మీ., తిరుపతి జిల్లా నాయుడుపేటలో 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

డిసెంబర్ 1 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచన

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ తేదీ వరకు పలుచోట్ల వర్షాలు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా గురువారం పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో పొడి వాతావరణం – పెరిగిన చలి తీవ్రత

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చలి తీవ్రత గణనీయంగా పెరిగిందని, రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పొడి వాతావరణమే కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

Tags

Be the first to react

Latest