బ్లింక్ ఇట్ సీక్రెట్ వ్యాపారం! లాభాలు క్విక్ డెలివరీ కాదు!

Blinkit: బ్లింకిట్ వేగవంతమైన డెలివరీ ద్వారా లాభాలు ఆర్జించడం లేదని, వినియోగదారులను ప్లాట్‌ఫామ్‌కు అలవాటు చేసి బ్రాండ్ల ప్రకటనలు (Ads) మరియు ప్లాట్‌ఫామ్ ఫీజుల ద్వారానే భారీ రాబడిని సమకూర్చుకుంటోందని విశ్లేషణ వెల్లడించింది. నష్టాల నుంచి నేడు భారీ మార్కెట్ విలువకు చేరిన బ్లింకిట్ అసలు బిజినెస్ మోడల్‌ను వాయిస్ ఆఫ్ సూర్య వీడియో సమగ్రంగా వివరించింది.

బ్లింక్ ఇట్ సీక్రెట్ వ్యాపారం
బ్లింక్ ఇట్ సీక్రెట్ వ్యాపారం
  • పరిసర ప్రాంతాల్లో డార్క్ స్టోర్స్ నెట్‌వర్క్.. రిటైల్ రంగాన్ని శాసిస్తున్న కొత్త ట్రెండ్!

  • వన్ నంబర్, గ్రోఫర్స్ నుంచి బ్లింకిట్ దాకా.. బిజినెస్ మోడల్‌ను పలుమార్లు మార్చిన ఫౌండర్లు!

  • షాపింగ్ మూడ్‌లో ఉన్న కస్టమర్లే టార్గెట్.. సెర్చ్ రిజల్ట్స్ టాప్‌లో బ్రాండ్ల యాడ్స్ యుద్ధం!

Business: బ్లింకిట్ (Blinkit) పేరు వినగానే చాలామంది కేవలం నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలను నిమిషాల వ్యవధిలో ఇంటికి డెలివరీ చేసే ఒక క్విక్ కామర్స్ యాప్ అని మాత్రమే అనుకుంటారు. కానీ తెర వెనుక వారు చేస్తున్న అసలు వ్యాపారం వేరొకటి ఉంది. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఒక స్టార్టప్‌ను జొమాటో (Zomato) వేల కోట్లు వెచ్చించి ఎందుకు కొనుగోలు చేసిందో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ప్రస్తుతం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ అంచనాల ప్రకారం బ్లింకిట్ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలకు పైగా దూసుకెళ్లింది. అంతేకాకుండా జొమాటో మాతృ సంస్థ మొత్తం రెవెన్యూలో అత్యధిక వాటా ఒక్క బ్లింకిట్ నుంచే సమకూరుతుండటం విశేషం.

స్టార్టప్ ప్రయాణం – 'వన్ నంబర్' నుంచి 'బ్లింకిట్' దాకా

ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ సౌరభ్ కుమార్, ఆయన స్నేహితుడు అల్బిందర్ దిన్సాలు రవాణా రంగంలో లోపాలను గమనించి తొలుత 'వన్ నంబర్' పేరిట లోకల్ డెలివరీ సేవలను ఆరంభించారు. స్థానిక కిరాణా కొట్లు, ఫార్మసీల నుంచి ఆర్డర్లను పికప్ చేసి వినియోగదారులకు చేరవేయడం దీని ఉద్దేశం. అనంతరం దీనిని 'గ్రోఫర్స్' (Grofers) గా రీబ్రాండ్ చేసి ఆన్‌లైన్ వేదిక ద్వారా త్వరితగతిన డెలివరీ చేసే మోడల్‌ను తీసుకొచ్చారు. కాలక్రమేణా కస్టమర్ల అవసరాలు పెరగడంతో, ప్రతి ప్రాంతంలో సొంత ఇన్వెంటరీతో కూడిన 'డార్క్ స్టోర్స్' (Dark Stores) నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. కన్నుమూసి తెరిచేలోపే డెలివరీ చేస్తామనే భరోసాతో గ్రోఫర్స్‌ను 'బ్లింకిట్'గా మార్చారు.

త్వరిత డెలివరీ ఎందుకు లాభాలు ఇవ్వదు?

క్విక్ కామర్స్ రంగంలో వినియోగదారుల నుంచి తీసుకునే సాధారణ డెలివరీ ఛార్జీలతో డెలివరీ బాయ్స్ జీతాలు, వాహనాల ఇంధనం, డార్క్ స్టోర్ అద్దెలు, యాప్ నిర్వహణ ఖర్చులు ఏమాత్రం భర్తీ కావు. డెలివరీ ఫీజులు భారీగా పెంచితే వినియోగదారులు ఇతర ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లిపోతారు. దీంతో ప్రతి ఆర్డర్‌పై కంపెనీకి నికరంగా నష్టమే మిగులుతుంది. అయినా కూడా కంపెనీలు ఫాస్ట్ డెలివరీని ఆపకపోవడానికి అసలు కారణం వినియోగదారులను ఒక అలవాటుగా ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానించడమే.

అసలు సీక్రెట్: సెర్చ్ యాడ్స్ మరియు ప్లాట్‌ఫామ్ ఫీజులు

బ్లింకిట్ సాధిస్తున్న అసలు రాబడి డెలివరీ ఛార్జీల నుంచి కాదు, కార్పొరేట్ బ్రాండ్ల ప్రకటనల (Ads) నుంచి వస్తోంది. సాధారణ రోడ్లపై లేదా సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ చూసేవారు వెంటనే వస్తువులను కొనుగోలు చేయకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి బ్లింకిట్ యాప్ తెరిచాడంటే, అతను ఏదో ఒక వస్తువును తక్షణమే కొనాలనే ఉద్దేశంతోనే (High Buying Intent) ఉంటాడు. అటువంటి సమయంలో యాప్‌లో ఏదైనా కేటగిరీ సెర్చ్ చేయగానే బ్రాండెడ్ కంపెనీల ఉత్పత్తులు హోమ్ పేజీలో, సెర్చ్ రిజల్ట్స్ టాప్‌లో స్పాన్సర్డ్ యాడ్స్‌గా దర్శనమిస్తాయి. తమ ఉత్పత్తులు వినియోగదారుడికి ముందుగా కనిపించేలా చేయడానికి బడా ఎఫ్‌ఎంసీజీ (FMCG), ఎలక్ట్రానిక్స్, బ్యూటీ కేర్ సంస్థలు బ్లింకిట్‌కు భారీగా యాడ్స్ బడ్జెట్ మరియు ప్లాట్‌ఫామ్ ఫీజులను చెల్లిస్తున్నాయి.

జియో తరహా వ్యూహాత్మక మైండ్‌గేమ్

రిలయన్స్ సంస్థ వేల కోట్లు వెచ్చించి ఐపీఎల్ హక్కులను కొని, వీక్షకులకు ఉచితంగా ప్రసారం చేయడం ద్వారా కోట్లాది మంది యూజర్లను ఒకే చోటికి చేర్చి, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని రాబడుతోంది. సరిగ్గా బ్లింకిట్ కూడా వేగవంతమైన డెలివరీ అనే సౌలభ్యాన్ని అందించి దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తెచ్చింది. ఆ భారీ యూజర్ బేస్‌ను చూపి బ్రాండ్ల నుంచి భారీ ప్రకటనల ఆదాయాన్ని పొందుతోంది.

మార్కెట్ మార్పులకు అనుగుణంగా విస్తరణ

కేవలం కిరాణా సరుకులకే పరిమితం కాకుండా ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు, దుస్తులు, గృహోపకరణాలను సైతం బ్లింకిట్ తమ డార్క్ స్టోర్లలో అందుబాటులోకి తెస్తోంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార నమూనాను మార్చుకుంటూ, విస్తరిస్తూ క్విక్ కామర్స్ మార్కెట్‌లో లీడర్‌గా ఎదగడం స్టార్టప్ రంగంలో ఒక గొప్ప కేస్ స్టడీగా నిలుస్తోంది.

Tags

Be the first to react

Latest