సుప్రీంకోర్టు దెబ్బకు ప్రవేట్ యూనివర్సిటీల విలవిల! వసూలు చేసిన ఫీజుల లెక్కలు చెప్పాల్సిందే!

Supreme Court: ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యా సంస్థలా లేక వ్యాపార సామ్రాజ్యాలా అని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆడిట్ నివేదికలు, ఫీజుల వసూళ్లు, సర్ప్లస్ ఫండ్స్ పెట్టుబడులు, ప్రభుత్వ భూ రాయితీలు మరియు ఫ్యాకల్టీ నిజమైన హాజరు వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఆదేశాలు పాటించని వారికి భారీ జరిమానా విధిస్తూ విద్యను లాభార్జన కేంద్రంగా మార్చవద్దని హెచ్చరించింది.

సుప్రీంకోర్టు దెబ్బకు ప్రవేట్ యూనివర్సిటీల విలవిల
సుప్రీంకోర్టు దెబ్బకు ప్రవేట్ యూనివర్సిటీల విలవిల
  • విద్యార్థుల ఫీజులతో భూములు, కమర్షియల్ ప్రాపర్టీలా? సర్ప్లస్ ఫండ్స్ గుట్టు రట్టు చేయనున్న న్యాయస్థానం!

  • ప్రభుత్వాల నుంచి పొందిన భూములు, రాయితీల వివరాలు బయటపెట్టాల్సిందే!

  • బ్రోచర్‌లో ఫోటోలు సరే.. నిజంగా క్లాసులు తీసుకున్నారా? ఫ్యాకల్టీ హాజరుపై ఆరా!

Business: తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆశతో తల్లిదండ్రులు జీవితాంతం దాచుకున్న సొమ్మును వెచ్చించి, అవసరమైతే ఆస్తులు అమ్మి, అప్పులు చేసి లక్షలాది రూపాయల ఫీజులు చెల్లిస్తున్నారు. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, డెవలప్‌మెంట్ ఫీజు, ల్యాబ్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, ఈవెంట్ ఫీజు అంటూ రకరకాల పేర్లతో వసూలు చేస్తున్న ఆ అపరిమిత ధనం నిజంగా విద్యార్థులకే ఖర్చవుతోందా? తరగతి గదులు, ఆధునిక ల్యాబ్‌లు, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ జీతాలు, రీసెర్చ్ లైబ్రరీలకు వెళ్తుందా? లేక ఎడ్యుకేషన్ ముసుగులో ప్రమోటర్లు, గవర్నింగ్ బాడీ సభ్యుల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలకు, సంబంధం లేని వ్యాపారాలకు మళ్లుతోందా? ఇప్పుడు ఇదే ప్రశ్నను దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీలను నిలదీస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది.

'ఆయేషా జైన్ వర్సెస్ అమిటీ యూనివర్సిటీ' కేసుతో కదిలిన డొంక

నోయిడాలోని అమిటీ యూనివర్సిటీకి వ్యతిరేకంగా 'ఆయేషా జైన్' అనే విద్యార్థిని దాఖలు చేసిన ఒక వ్యక్తిగత పిటిషన్‌తో ఈ కేసు ప్రారంభమైంది. అయితే విచారణ సాగుతున్న కొద్దీ ప్రైవేట్ విద్యాసంస్థల ఏర్పాటు, నిర్వహణ, ప్రభుత్వ రాయితీల దుర్వినియోగం, ఫీజుల దోపిడీ వంటి అనేక లోతైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును సాధారణ వ్యాజ్యంగా కాకుండా దేశవ్యాప్త ప్రజాప్రయోజన పరిశీలనగా (Public Interest Scrutiny) విస్తరించింది. "ఏ ప్రైవేట్ యూనివర్సిటీని లాభార్జన కేంద్రంగా (Profit Making Institution) నడవనివ్వకూడదు" అని ధర్మాసనం అత్యంత స్పష్టమైన హెచ్చరిక చేసింది.

సర్ప్లస్ ఫండ్స్ వేరు.. అధిక లాభార్జన వేరు

సంస్థ సజావుగా నడవడానికి, సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికి, మౌలిక వసతులు మెరుగుపరచడానికి కొంత అదనపు నిధి (రీజనబుల్ సర్ప్లస్) ఉండటం సహజమేనని కోర్టు అంగీకరించింది. కానీ ఆ పేరుతో వసూలు చేసిన ప్రజాధనాన్ని ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యుల కంపెనీలకు మళ్లించడం, ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల నుంచి సమగ్ర సమాచారాన్ని కోరుతూ సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు విధించింది:

  1. ఆడిట్ ఫైనాన్షియల్ రిపోర్టులు: గత కాలానికి సంబంధించిన నిధుల వసూళ్లు ఎంత? ఆ డబ్బు ఎవరికి చెల్లించారు? కన్సల్టెన్సీ, లీజు, రాయల్టీ, బ్రాండ్ ఫీ పేరిట మేనేజ్‌మెంట్‌కు మళ్లించారా? అనే రికార్డులను సమర్పించాలి.

  2. ప్రభుత్వ రాయితీలు & భూముల లెక్కలు: ప్రభుత్వాల నుంచి మార్కెట్ రేటు కాకుండా ఎంత చౌకగా లేదా కన్సెషన్ రేట్లకు భూములు పొందారు? ఏయే నిబంధనల నుంచి మినహాయింపులు తెచ్చుకున్నారు? అనే వివరాలు చెప్పాలి.

  3. అడ్మిషన్లు & పరీక్షల నిర్వహణ: అడ్మిషన్ల ప్రక్రియ, ప్రశ్నాపత్రాల తయారీ, మూల్యాంకనం, నిధుల నియంత్రణలో పారదర్శకత ఎంత ఉందో నిరూపించాలి.

  4. వసూలు చేసిన ప్రతి రూపాయి లెక్క: బ్రోచర్‌లో చూపించిన ఫీజు మాత్రమే కాకుండా కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థి కుటుంబం నుంచి సేకరించిన మొత్తం ఖర్చు వివరాలను బయటపెట్టాలి.

  5. సర్ప్లస్ నిధుల పెట్టుబడులు: మిగిలిన నిధులను డిపాజిట్లు చేశారా? లేక అనుబంధ రియల్ ఎస్టేట్ వెంచర్లలో, భూముల్లో పెట్టుబడులు పెట్టారా? అనేది స్పష్టం చేయాలి.

  6. బోగస్ ఫ్యాకల్టీ హాజరు పరిశీలన: బ్రోచర్లలో ప్రముఖ ప్రొఫెసర్ల ఫోటోలు చూపించి మభ్యపెట్టడం కాకుండా, అసలు ఆ ఫ్యాకల్టీ క్యాంపస్‌లో ఉన్నారా? వారికి కేటాయించిన తరగతులు ఎన్ని? నిజంగా ఎన్ని క్లాసులు తీసుకున్నారు? అనే కచ్చితమైన రికార్డులు సమర్పించాలి.

  7. మెడికల్ కాలేజీలు & ఆసుపత్రుల తనిఖీలు: అనుబంధ ఆసుపత్రుల స్థితిగతులు, రెగ్యులేటరీ సంస్థలు గుర్తించిన లోపాలు, వాటిని సరిదిద్దిన తీరుపై అఫిడవిట్ దాఖలు చేయాలి.

మూడు స్థాయిల జవాబుదారీతనం – భారీ జరిమానా

ఈ విచారణలో సుప్రీంకోర్టు మూడు స్థాయిల బాధ్యతను నిర్దేశించింది. కేవలం యూనివర్సిటీలు వివరాలు ఇవ్వడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వివరాలను సేకరించి పక్కా అఫిడవిట్ ద్వారా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. యూనివర్సిటీలు ఇచ్చిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్డిగా కాపీ-పేస్ట్ చేయకూడదని, క్షేత్రస్థాయిలో నిజానిజాలు ధృవీకరించుకోవాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ విచారణకు ప్రాతినిధ్యం వహించని రెస్పాండెంట్లకు భారీ జరిమానా విధించి తన తీవ్రతను చాటిచెప్పింది.

విద్య పేరిట రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలకు చెక్!

విద్యా విస్తరణ పేరుతో విద్యార్థుల నుంచి భారీ ఫీజులు దండుకుని, ఆ సొమ్ముతో పెద్ద ఎత్తున భూములు కొనడం, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించి ల్యాండ్ బ్యాంకులుగా మార్చుకుంటున్న బడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల తీరుకు సుప్రీంకోర్టు తాజా జోక్యంతో అడ్డుకట్ట పడనుంది. ఫీజుల పేరిట తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తున్న ఈ వ్యవస్థలో సంపూర్ణ పారదర్శకత రావాలని దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

Tags

Be the first to react

Latest