అక్టోబర్ 1 నుంచి మారిన ఐదు నిబంధనలు.. సామాన్యుడి జేబుకు చిల్లే!

New Financial Rules: దేశంలో అక్టోబర్ నెల నుంచి ఐదు ప్రధాన ఆర్థిక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.69 పెరగగా, డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు ఈకేవైసీ తప్పనిసరి అయింది. యూపీఐ వ్యాపార చెల్లింపుల్లో రూ.2,000 దాటిన లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు, ఎస్‌బీఐ శాలరీ ఖాతాదారులకు ఇతర బ్యాంక్ ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితి 10 నుంచి 5కు తగ్గింపు మరియు రూ.3 కోట్ల బల్క్ ఎఫ్‌డీలపై ఆర్బీఐ పారదర్శక నిబంధనలు తీసుకొచ్చింది.

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన 5 భారీ ఆర్థిక మార్పులు
అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన 5 భారీ ఆర్థిక మార్పులు
  • కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌‌పై రూ.69 పెంపు.. హోటళ్లు, ఫుడ్ కోర్టుల్లో పెరగనున్న ఖర్చులు!

  • డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్‌కు ఈకేవైసీ తప్పనిసరి.. నిర్లక్ష్యం చేస్తే సబ్సిడీ గల్లంతు!

  • యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు రూ.2 వేలు దాటితే కట్!

Business: నెల ఆరంభం నుంచే దేశవ్యాప్తంగా సామాన్యులు, వ్యాపారుల నెలవారీ బడ్జెట్‌‌పై ప్రభావం చూపే ఐదు ప్రధాన మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు ఏకంగా రూ.69 మేర పెంచాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు ఉన్న సిలిండర్ ధర గణనీయంగా పెరిగి మూడు వేల రూపాయల మార్కును దాటింది. హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, ఫుడ్ ట్రక్ నిర్వాహకులకు ఈ పెంపు తీవ్ర భారంగా మారడంతో పాటు ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు ఈకేవైసీ నిబంధన

ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ఉన్న వినియోగదారులు తమ కనెక్షన్‌కు సంబంధించి ఆధార్ ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అయింది. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ బుకింగ్ సమస్యలు ఎదురవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. కేవైసీ పూర్తి చేయని వారికి మార్కెట్ ఆధారిత పూర్తి రేటు వర్తించే అవకాశం ఉన్నందున సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించి లేదా ఆన్‌లైన్ ద్వారా వెంటనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ బాదుడు

డిజిటల్ చెల్లింపుల రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. అయితే ఇది సామాన్య వినియోగదారులు ఒకరికొకరు చేసుకునే వ్యక్తిగత (P2P) బదిలీలకు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతుంది. ప్రధానంగా దుకాణాలు, సంస్థలకు చేసే వ్యాపార లావాదేవీల్లో రూ.2,000 దాటిన చెల్లింపులపై 0.4 శాతం ఫీజుతో పాటు 18 శాతం జీఎస్టీ అమలవుతుంది. అయితే రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే చిన్న చిరు వ్యాపారులకు నెలకు రూ.లక్ష వరకు లావాదేవీలకు ప్రభుత్వం మినహాయింపు కల్పించింది.

చిరు వ్యాపారుల నుంచి కస్టమర్లపైకి బదిలీ అయ్యే ప్రమాదం

పెద్ద మాల్స్, సూపర్ మార్కెట్లతో పోలిస్తే స్థానిక వ్యాపారులు రూ.2,000 కంటే ఎక్కువ విలువైన బిల్లులకు యూపీఐ చెల్లింపులు తీసుకున్నప్పుడు పడే ఈ ఎండీఆర్ భారాన్ని చివరికి కస్టమర్లపైనే మోపే అవకాశాలు లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో అదనపు ఛార్జీలను చెల్లించాలని కోరడం లేదా వస్తువుల ధరల్లోనే ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యాపారులు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ద్వారా కొంత ఊరట పొందినప్పటికీ, చిన్న వ్యాపార వర్గాల్లో ఈ విధానంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

ఎస్‌‌బీఐ శాలరీ ఖాతాదారుల ఏటీఎం లిమిట్ తగ్గింపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో శాలరీ అకౌంట్లు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బ్యాంక్ గట్టి షాక్ ఇచ్చింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇప్పటివరకు నెలకు అందుబాటులో ఉన్న 10 ఉచిత లావాదేవీల పరిమితిని కేవలం 5 లావాదేవీలకు కుదించింది. ఈ పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి నగదు ఉపసంహరణకు జీఎస్టీతో కలిపి సుమారు రూ.27కు పైగా అదనపు ఛార్జీ కట్ అవుతుంది. అలాగే కేవలం బ్యాలెన్స్ చెక్ లేదా మినీ స్టేట్‌మెంట్ వంటి నగదు రహిత లావాదేవీలకు సైతం రూ.11తో పాటు జీఎస్టీ వర్తిస్తుంది.

బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆర్బీఐ సరికొత్త నిబంధన

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచే దిశగా బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Bulk FDs) కటాఫ్ పరిమితిని రూ.3 కోట్లకు పెంచింది. రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేసే సంస్థలు, ట్రస్టులు పొందే వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఉదయం బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్లలో తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో పేర్కొన్న రేట్ల ప్రకారమే అన్ని శాఖల్లోనూ అమలు చేయాలని, ఆఫ్ లైన్‌లో ఇష్టానుసారంగా వడ్డీలను నిర్ణయించే విధానానికి చెక్ పెడుతూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

Tags

Be the first to react

Latest