చంద్రబాబు ఆదేశాలు, పెరగనున్న బియ్యం కేంద్రాలు.. రూ.225కే రెండు సరుకులు

AP Ration Subsidy: ఏపీలో డిసెంబర్ నుంచి కిలో కందిపప్పు రూ.100కు, లీటర్ పామాయిల్ రూ.125కు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ధరణి బియ్యం కేంద్రాలు 500కు పెంపు.

నిత్యావసర ధరలపై చంద్రబాబు సమీక్ష
నిత్యావసర ధరలపై చంద్రబాబు సమీక్ష
  • ఏపీలో ధరణి బియ్యానికి భారీ డిమాండ్.. 26 కేజీలు రూ.1,300కే

  • నిత్యావసర ధరలపై చంద్రబాబు సమీక్ష.. ప్రజలకు ఊరట కల్పించే నిర్ణయాలు

  • రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి కొత్త ధరలు

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నుంచి ప్రజలకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బియ్యం, పప్పులు, వంట నూనె వంటి సరుకులను తక్కువ ధరలకు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

డిసెంబర్ నెల నుంచి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పామాయిల్‌ను సబ్సిడీ ధరలకు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కిలో కందిపప్పును రూ.100కు, లీటర్ పామాయిల్‌ను రూ.125కు అందించాలని నిర్ణయించారు. ఈ రెండు సరుకులు కలిపి రూ.225కే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

మరోవైపు ధరణి బ్రాండ్ బియ్యానికి ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో విక్రయ కేంద్రాలను పెంచాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 286 కేంద్రాలు ఉండగా, వాటిని 500కు విస్తరించాలని అధికారులను ఆదేశించారు. 26 కిలోల ధరణి బియ్యం బస్తాను రూ.1,300కు విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 2.25 లక్షల మందికి పైగా వినియోగదారులు 59,662 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక మార్కెట్‌లో బియ్యం ధరలు అక్టోబర్‌తో పోలిస్తే 18 శాతం వరకు తగ్గినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఉల్లిపాయల ధరలు 28 శాతం, పామాయిల్ ధర 5 శాతం వరకు తగ్గినట్లు తెలిపారు. బియ్యం, నిత్యావసర సరుకుల అక్రమ రవాణాను అరికట్టేందుకు టోల్‌గేట్లు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని సీఎం సూచించారు.

అలాగే రాబోయే రోజుల్లో ఉల్లి, టమాటా ధరలు తగ్గే అవకాశాలున్నాయని అగ్రివాచ్ నివేదికలు చెబుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కూరగాయల ధరలు పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సూచించారు. రైతులు కందిపప్పు సాగు చేసేలా ప్రోత్సహించాలని, తక్కువ నీటితో పండించే వరి రకాలను ప్రోత్సహించాలని తెలిపారు.

Tags

Be the first to react

Latest