GST New Rules: ఆగస్టు 1 నుంచి మారనున్న జీఎస్‌టీ నిబంధనలు.. ఇ-వే బిల్లులో కీలక మార్పులు!
GST New Rules: ఆగస్టు 1 నుంచి ఇ-ఇన్‌వాయిస్, ఇ-వే బిల్లుల దాఖలులో జీఎస్‌టీఎన్ కీలక మార్పులు తెచ్చింది. 'బిల్-టు / షిప్-టు' లావాదేవీలలో డెలివరీ స్థానపు 'షిప్-టు జీఎస్‌టీఐఎన్' నమోదు చేయడం తప్పనిసరి (అన్‌రిజిస్టర్డ్ అయితే 'URP' వాడాలి). బి2బి, సెజ్ లావాదేవీలలో ఈ వివరాలు మార్చడానికి కుదరదు. అలాగే సరుకు డెలివరీ అయ్యాక ఇ-వే బిల్లును స్వచ్ఛందంగా క్లోజ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు.
- వ్యాపారులకు అప్రమత్తత.. 'షిప్-టు జీఎస్‌టీఐఎన్' లేకపోతే ఇ-వే బిల్లు రిజెక్ట్!
- ఇ-ఇన్‌వాయిస్, ఇ-వే బిల్లుల్లో కొత్త సవరణలు.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న రూల్స్ ఇవే!
- డెలివరీ కాగానే ఇ-వే బిల్ క్లోజ్ చేసుకోవచ్చు.. ఓటీపీతో డ్రైవర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన జీఎస్‌టీఎన్!
GST New Rules: వ్యాపార లావాదేవీలలో పారదర్శకతను పెంచేందుకు మరియు పన్ను ఎగవేతలను అరికట్టేందుకు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్ (GSTN) ఇ-ఇన్‌వాయిస్ (e-Invoice) మరియు ఇ-వే బిల్లు (e-Way Bill) వ్యవస్థల్లో కీలక మార్పులను తీసుకువచ్చింది. గతంలో జూన్ 15 నుంచి అమలు చేయాలని భావించిన ఈ సవరించిన నిబంధనలను, వ్యాపారులు తమ సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను సిద్ధం చేసుకునేందుకు వీలుగా డిఫర్ చేస్తూ ఆగస్టు 1 నుంచి వ్యాపార వర్గాలన్నింటికీ తప్పనిసరి చేస్తూ జీఎస్‌టీఎన్ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ నూతన నిబంధనల్లో అత్యంత కీలకమైనది 'బిల్-టు / షిప్-టు' (Bill-To / Ship-To) లావాదేవీలకు సంబంధించి 'షిప్-టు జీఎస్‌టీఐఎన్' (Ship-To GSTIN) వివరాలను తప్పనిసరిగా నమోదు చేయడం. సరుకు కొనుగోలు చేసే వ్యక్తి (Bill-To) ఒకరు, ఆ సరుకు డెలివరీ అయ్యే ప్రాంతం (Ship-To) మరొకటి ఉన్న సందర్భాల్లో ఇకపై తప్పనిసరిగా డెలివరీ ప్రాంతపు జీఎస్‌టీ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సరుకు స్వీకరించే వ్యక్తి జీఎస్‌టీ వద్ద నమోదు కానీ అన్‌రిజిస్టర్డ్ వ్యక్తి అయితే, ఆ ఫీల్డ్‌లో 'URP' (Unregistered Person) అని పేర్కొనాలి.
ఇ-ఇన్‌వాయిస్ (IRN) జనరేషన్ సమయంలో నమోదు చేసిన షిప్-టు వివరాలను బి2బి (B2B) మరియు సెజ్ (SEZ) లావాదేవీల ఇ-వే బిల్లు ప్రక్రియలో మార్చడానికి వీలుండదు. ఐఆర్‌ఎన్ జనరేషన్ సమయంలో నమోదు చేసిన వివరాలే ఆఖరివిగా పరిగణించబడతాయి. సరైన లేదా సంపూర్ణమైన షిప్-టు వివరాలు నమోదు చేయకపోతే జీఎస్‌టీ పోర్టల్ ఆ ఇ-వే బిల్లు జనరేషన్ అభ్యర్థనను ఆటోమేటిక్‌గా తిరస్కరిస్తుంది (Reject).
దీంతో పాటు జీఎస్‌టీఎన్ 'వాలంటరీ ఇ-వే బిల్ క్లోజర్' (Voluntary E-Way Bill Closure) పేరుతో సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. డెలివరీ పూర్తయిన తర్వాత అనవసరంగా లేదా యాక్టివ్‌గా ఉండే ఇ-వే బిల్లులను నిరోధించేందుకు సరఫరాదారులు, సరుకు స్వీకర్తలు, ట్రాన్స్‌పోర్టర్లు లేదా ఆథరైజ్డ్ డ్రైవర్లు డెలివరీ ముగిసిన రోజు లేదా మరుసటి రోజున ఇ-వే బిల్లును 'క్లోజ్' చేయవచ్చు. డ్రైవర్లు తమ వద్ద జిఎస్టీ లాగిన్ వివరాలు లేకుండానే రిజిస్టర్డ్ మొబైల్ ఓటీపీ (OTP) ఆధారంగా ఈ క్లోజర్ పూర్తి చేయవచ్చు.
ఈ కొత్త సవరణల వల్ల పన్ను క్రెడిట్ (ITC) మ్యాచింగ్ సులభతరమవ్వడమే కాకుండా, నకిలీ బిల్లలతో జరిగే మోసాలకు చెక్ పడనుంది. ఆగస్టు 1 నుండి రవాణా ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండేందుకు వ్యాపార సంస్థలు, ఆడిటర్లు, ఇఆర్‌పి (ERP) సాఫ్ట్‌వేర్ డెవలపర్లు తమ బిల్లింగ్ సిస్టమ్‌లను నూతన ఏపీఐ (API) ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Tags
Be the first to react