Nara Lokesh: శ్రీసిటీలో సోలమ్ యూనిట్ నిర్మాణాన్ని వేగవంతం చేయండి.. దక్షిణ కొరియా సంస్థకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి!
Nara Lokesh: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణ దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యటన రెండో రోజు సియోల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలమ్ (SOLUM) గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హాతో సమావేశమయ్యారు.
రూ.338 కోట్ల సోలమ్ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని ఏపీ విజ్ఞప్తి..
శ్రీసిటీలో ఎలక్ట్రానిక్స్ తయారీ విస్తరణకు సోలమ్ను ఆహ్వానించిన లోకేష్..
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణ దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యటన రెండో రోజు సియోల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలమ్ (SOLUM) గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హాతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో రూ.338 కోట్ల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలమ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి, ఉత్పత్తిని వీలైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు.
అలాగే తిరుపతిలో CSOT (TCL)కు ఇప్పటికే డిస్ప్లే అసెంబ్లీ ఫెసిలిటీ ఉన్నందున, ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ (ESL), ఇతర డిస్ప్లే సంబంధిత ఉత్పత్తుల తయారీని కూడా శ్రీసిటీ యూనిట్లో చేపట్టి కార్యకలాపాలను మరింత విస్తరించాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో సోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హా తమ సంస్థ కార్యకలాపాల గురించి వివరించారు. సోలమ్ ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో పీబీబీఏ (PBBA) తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో కొత్త ప్లాంట్ నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు.
ప్రస్తుతం సోలమ్ సంస్థ 16 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా బలమైన సరఫరా, విక్రయ నెట్వర్క్ను కలిగి ఉందని చెప్పారు. ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ (ESL) రంగంలో Vusion Group, E Ink, పానసొనిక్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు అగ్రశ్రేణి కంపెనీలలో సోలమ్ ఒకటిగా నిలిచిందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న శ్రీసిటీ యూనిట్ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని జీగాబ్ హా మంత్రి లోకేష్కు హామీ ఇచ్చారు. ఈ భేటీతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి మరింత ఊతం లభించడంతో పాటు కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Tags
Be the first to react