Nara Lokesh: ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి.. సాఫ్ట్-ఈపీఐ సంస్థకు మంత్రి లోకేష్ ఆహ్వానం!
Nara Lokesh: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి అధునాతన సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యటన రెండో రోజు సియోల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సాఫ్ట్-ఈపీఐ (Soft-Epi) కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చోలతో ఆయన భేటీ అయ్యారు.
దక్షిణ కొరియా సాఫ్ట్-ఈపీఐ సంస్థతో మంత్రి లోకేష్ కీలక భేటీ..
తిరుపతి ఐఐటీతో అడ్వాన్స్డ్ ఎపిటాక్సీ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన..
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి అధునాతన సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యటన రెండో రోజు సియోల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సాఫ్ట్-ఈపీఐ (Soft-Epi) కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చోలతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భారత్లోని కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరచుకుని ఆంధ్రప్రదేశ్లో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే మెటీరియల్ హబ్ను ఏర్పాటు చేయాలని సాఫ్ట్-ఈపీఐ సంస్థను కోరారు. దీంతో డిస్ప్లే తయారీ రంగంలో రాష్ట్రం కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
అలాగే తిరుపతి ఐఐటీ సహకారంతో అడ్వాన్స్డ్ ఎపిటాక్సీ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. GaN ఎపిటాక్సీ, MOCVD, మైక్రో ఎల్ఈడీ సాంకేతికతల్లో ప్రతి సంవత్సరం 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చేలా సాఫ్ట్-ఈపీఐ అకాడమీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో సాఫ్ట్-ఈపీఐ సంస్థ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ తమ సంస్థ కార్యకలాపాల గురించి వివరించారు. దక్షిణ కొరియాలో GaN ఎపివేఫర్లు (Epiwafers), మైక్రో ఎల్ఈడీ ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం భారత్లో తమ సంస్థకు ప్రత్యక్ష తయారీ యూనిట్ లేదా ఇతర కార్యకలాపాలు లేవని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని వెల్లడించారు.
ఈ భేటీతో రాష్ట్రంలో అధునాతన డిస్ప్లే టెక్నాలజీ, సెమీకండక్టర్ అనుబంధ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Tags
Be the first to react