Gujarat: కాజు కట్లీలో అల్యూమినియం ఫాయిల్.. 31 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత వ్యాపారికి ఊరట!
Gujarat: కాజు కట్లీ తయారీలో వెండి ఫాయిల్‌కు బదులుగా అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించారనే కేసులో దాదాపు మూడు దశాబ్దాలుగా సాగుతున్న న్యాయపోరాటానికి తెరపడింది. 1995లో నమోదైన ఈ కేసులో వ్యాపారి భానుభాయ్‌కు విధించిన మూడేళ్ల జైలు శిక్షను గుజరాత్ హైకోర్టు 2026 జూన్ 17న రద్దు చేసింది.
1995 కాజు కట్లీ కేసులో కీలక తీర్పు.. మూడేళ్ల జైలు శిక్ష రద్దు చేసిన గుజరాత్ హైకోర్టు..
అల్యూమినియం ఫాయిల్ ఆరోగ్యానికి హానికరమని ఆధారాలేవీ లేవు.. కాజు కట్లీ కేసులో HC..
అహ్మదాబాద్: కాజు కట్లీ తయారీలో వెండి ఫాయిల్‌కు బదులుగా అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించారనే కేసులో దాదాపు మూడు దశాబ్దాలుగా సాగుతున్న న్యాయపోరాటానికి తెరపడింది. 1995లో నమోదైన ఈ కేసులో వ్యాపారి భానుభాయ్‌కు విధించిన మూడేళ్ల జైలు శిక్షను గుజరాత్ హైకోర్టు 2026 జూన్ 17న రద్దు చేసింది.
ఆహార తనిఖీ అధికారి నమూనా సేకరించే సమయంలో Prevention of Food Adulteration Rules, 1955లోని రూల్ 14ను పాటించలేదని హైకోర్టు గుర్తించింది. అలాగే కాజు కట్లీలో అల్యూమినియం ఫాయిల్ ఉండటం ఆరోగ్యానికి హానికరమని నిరూపించే ఆధారాలు కూడా కోర్టు ముందు సమర్పించలేదని పేర్కొంది.
1995 మార్చి 9న ఉదయం 10.30 గంటలకు ఆహార తనిఖీ అధికారి చౌదరి విధుల్లో భాగంగా గుజరాత్‌లోని సూరత్ జిల్లా వ్యారా ప్రాంతంలోని భానుభాయ్ స్వీట్ షాప్‌కు వెళ్లారు.
అక్కడ ఫామ్ నంబర్ 6 ద్వారా ముందస్తు సమాచారం ఇచ్చి రూ.96కు కాజు కట్లీ కొనుగోలు చేశారు. అనంతరం ఆ నమూనాను పరీక్ష కోసం భుజ్‌లోని పబ్లిక్ అనలిస్ట్‌కు పంపించారు.
పరీక్షలో కాజు కట్లీలో అల్యూమినియం ఫాయిల్ ఉన్నట్లు పబ్లిక్ అనలిస్ట్ నిర్ధారించారు. దీంతో ఆహార తనిఖీ అధికారి Prevention of Food Adulteration Act, 1954, సంబంధిత నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ భానుభాయ్, ఆయన భాగస్వాములపై కేసు పెట్టేందుకు అనుమతి కోరారు. అనుమతి రావడంతో వ్యారా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలైంది.
ఈ కేసులో భానుభాయ్ తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించలేదు. భుజ్ పబ్లిక్ అనలిస్ట్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత, నమూనాను మరోసారి పరీక్షించాలని కోరారు. తన కాజు కట్లీ నమూనాను సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీ, ఘాజియాబాద్కు పంపాలని కోర్టును కోరారు. న్యాయస్థానం ఆ అభ్యర్థనను అంగీకరించింది.
ఘాజియాబాద్ కేంద్ర ప్రయోగశాల కూడా అదే తరహా నివేదిక ఇచ్చింది. నమూనాలో అల్యూమినియం ఫాయిల్ ఉన్నట్లు, అందువల్ల అది కల్తీగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. అంటే భుజ్, ఘాజియాబాద్ రెండు ప్రయోగశాలలు కూడా కాజు కట్లీలో అల్యూమినియం ఫాయిల్ ఉన్నట్లు నిర్ధారించాయి.
కోర్టులో ఆరోపణలు వివరించినప్పుడు భానుభాయ్ నేరాన్ని అంగీకరించలేదు. తాను నిర్దోషినని చెబుతూ విచారణను ఎదుర్కొంటానని తెలిపారు. సాక్ష్యాల నమోదు పూర్తయిన తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 313 కింద భానుభాయ్, ఆయన భాగస్వాముల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది. వారు నేరం చేయలేదని, తాము నిర్దోషులమని పేర్కొన్నారు.
కేసులోని సాక్ష్యాలను పరిశీలించిన వ్యారా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 2006 నవంబర్ 24న భానుభాయ్, ఆయన భాగస్వాములకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.
మేజిస్ట్రేట్ కోర్టు తీర్పుతో భానుభాయ్ న్యాయపోరాటం ఆపలేదు. 2006లో శిక్ష విధించినప్పటి నుంచి వివిధ న్యాయస్థానాల్లో ఆయన అప్పీల్ చేస్తూనే ఉన్నారు. చివరకు ఈ కేసు గుజరాత్ హైకోర్టుకు చేరింది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
2026 జూన్ 17న తీర్పు వెలువరించిన గుజరాత్ హైకోర్టు, ఆహార తనిఖీ అధికారి కాజు కట్లీ నమూనాను సేకరించిన విధానాన్ని పరిశీలించింది. Prevention of Food Adulteration Rules, 1955లోని రూల్ 14 ప్రకారం పాటించాల్సిన విధానం అనుసరించలేదని కోర్టు గుర్తించింది. నమూనా సేకరణలో నిబంధనలను పాటించకపోతే ఆ తర్వాత వచ్చిన ప్రయోగశాల నివేదికలపై ఆధారపడి శిక్ష విధించడం ప్రశ్నార్థకంగా మారుతుందని కోర్టు అభిప్రాయపడింది.
కేసులో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది. కాజు కట్లీలో అల్యూమినియం ఫాయిల్ ఉందని రెండు ప్రయోగశాలలు గుర్తించినప్పటికీ, ఆ అల్యూమినియం ఫాయిల్ వినియోగం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిరూపించే ఆధారాలను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు సమర్పించలేకపోయిందని హైకోర్టు పేర్కొంది.
ఈ అంశాలతో పాటు నమూనా సేకరణలో నిబంధనల ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, భానుభాయ్‌కు విధించిన మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది. 1995లో ఒక స్వీట్ షాపులో కాజు కట్లీ నమూనా సేకరణతో ప్రారంభమైన ఈ కేసు.. ప్రయోగశాల పరీక్షలు, మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు, వరుస అప్పీళ్లతో దాదాపు 31 ఏళ్ల పాటు కొనసాగింది.
చివరకు 2026 జూన్ 17న గుజరాత్ హైకోర్టు తీర్పుతో భానుభాయ్‌కు ఊరట లభించింది. ఆహార కల్తీ కేసుల్లో కేవలం పరీక్షా నివేదికలు మాత్రమే కాకుండా, నమూనా సేకరణకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, ఆరోగ్యపరమైన ప్రభావాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఎంత ముఖ్యమో ఈ కేసు మరోసారి చర్చకు తెచ్చింది.
Be the first to react