Youtube Content Creators: యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్.. మానిటైజేషన్ నిబంధనల్లో భారీ మార్పులు... ఈ రూల్స్ పాటించకపోతే అంతే!

Youtube Content Creators: యూట్యూబ్ మానిటైజేషన్ అర్హత సాధించడానికి వాచ్ అవర్స్‌ను 8,000 గంటలకు, షార్ట్స్ వ్యూస్‌ను 20 మిలియన్లకు పెంచింది. 2027 ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు కేవలం నూతనంగా వైపీపీలో చేరే క్రియేటర్లకు మాత్రమే వర్తిస్తాయి.

యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్
యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్
  • 2027 ఫిబ్రవరి 1 నుండి కొత్త రూల్స్ అమలు!.. కొత్త ఛానెళ్లకు భారీ విఘాతం!

  • పాత క్రియేటర్లకు బిగ్ రిలీఫ్!.. కొత్తగా వచ్చే వారికే కఠినమైన నిబంధనలు!

  • షార్ట్స్ ఇన్ కమ్ నిలిచిపోయే ప్రమాదం!.. పాత, కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ బిగ్ అప్‌డేట్!

Youtube Content Creators: యూట్యూబ్‌లో నూతనంగా ఛానెల్ ప్రారంభించి ఆదాయం పొందాలనుకునే క్రియేటర్లకు యూట్యూబ్ సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. ప్లాట్‌ఫారమ్‌లో క్రియేటర్ల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతుండటంతో పాటు కంటెంట్ నాణ్యతను కాపాడే లక్ష్యంతో యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) మానిటైజేషన్ అర్హత నిబంధనలను రెట్టింపు చేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. 2018 తర్వాత యూట్యూబ్ తన మానిటైజేషన్ నిబంధనలలో ఇంత భారీ స్థాయిలో సవరణలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

నూతన మార్గదర్శకాల ప్రకారం, ఇకపై ఒక యూట్యూబ్ ఛానెల్ మానిటైజ్ కావాలంటే గత 365 రోజులలో (ఒక ఏడాది వ్యవధిలో) కనీసం 8,000 గంటల పబ్లిక్ వాచ్ టైమ్‌ను సాధించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 4,000 గంటల వాచ్ టైమ్ పరిమితిని కంపెనీ ఏకంగా రెట్టింపు చేసింది. లేదా షార్ట్స్ ద్వారా మానిటైజ్ అవ్వాలనుకునే వారు గత 90 రోజుల్లో 20 మిలియన్ల (2 కోట్లు) క్వాలిఫైడ్ షార్ట్స్ వీక్షణలను సాధించడం తప్పనిసరి. అయితే ఛానెల్‌కు కనీసం 1,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలనే పాత నిబంధనలో ఎటువంటి మార్పు చేయలేదు. ఈ కొత్త నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుండి అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

ఇప్పటికే యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగస్వాములుగా ఉండి ఆదాయం పొందుతున్న పాత క్రియేటర్లకు ఈ నూతన ఎంట్రీ నిబంధనల నుంచి మినహాయింపు లభించింది. పాత ఛానెళ్ల మానిటైజేషన్ హోదా యథాతథంగా కొనసాగుతుంది. అయితే షార్ట్స్ ఆదాయానికి సంబంధించి పాత, కొత్త క్రియేటర్లు ఇద్దరికీ వర్తించేలా ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చారు. షార్ట్స్ క్ర్రియేటర్ పూల్ నుండి నిరంతరం ఆదాయం పొందాలంటే ప్రతి 90 రోజుల వ్యవధిలో కనీసం 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్‌ను నిలకడగా కొనసాగించాల్సి ఉంటుంది. ఈ వ్యూస్ పరిమితి తగ్గితే షార్ట్స్ ద్వారా వచ్చే ఆదాయం తాత్కాలికంగా ఆగుతుంది, కానీ లాంగ్ వీడియోల ఆదాయం కొనసాగుతుంది.

ఈ నిర్ణయానికి వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే, ప్రస్తుతం యూట్యూబ్‌లో ప్రతిరోజూ 200 బిలియన్లకు పైగా షార్ట్స్ వీక్షణలు నమోదు అవుతున్నాయి. అలాగే స్మార్ట్ టీవీలు మరియు పెద్ద తెరలపై యూట్యూబ్ వీక్షణ సమయం బిలియన్ గంటలు దాటిపోతోంది. కేవలం ఏదో ఒక వీడియో వైరల్ అవ్వడం ద్వారా కాకుండా, నిలకడగా క్వాలిటీ కంటెంట్ అందిస్తూ స్థిరమైన ఆడియన్స్‌ను కలిగి ఉన్న క్రియేటర్లను మాత్రమే ప్రోత్సహించాలని యూట్యూబ్ భావిస్తోంది. అందుకే వీక్షణ సమయాన్ని, షార్ట్స్ వ్యూస్ పరిమితిని పెంచుతూ కంపెనీ ఈ కఠినమైన నిబంధనలను రూపొందించింది.

అదే సమయంలో క్రియేటర్లకు ఊరటనిచ్చే అంశంగా యూట్యూబ్ 'ప్రీమియం లైట్' సబ్‌స్క్రిప్షన్‌ను అన్ని దేశాలకు విస్తరిస్తోంది. దీనివల్ల వచ్చే అదనపు ఆదాయంలో లాంగ్ ఫార్మాట్ క్రియేటర్లకు 55 శాతం, షార్ట్స్ క్రియేటర్లకు 45 శాతం వాటాను యూట్యూబ్ పంచుతుంది. మానిటైజేషన్ నిబంధనలు కఠినతరం కావడంతో కొత్తగా యూట్యూబ్ ప్రయాణం ప్రారంభించే వారికి సవాలుగా మారినప్పటికీ, క్వాలిటీ కంటెంట్ రూపొందించే క్రియేటర్లకు దీర్ఘకాలంలో ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుందని డిజిటల్ మీడియా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags

Be the first to react

Latest