⚡ BREAKING
Business

Food Poisoning: 'కంచి కెఫే' కి వెళ్తే కథ కంచికే... రెస్టారెంట్ల బండారం బట్టబయలు!

Food Poisoning: పుప్పాలగూడలోని 'కంచి కెఫే' లో బొద్దింకలు, బూజు పట్టిన సామాన్లు బయటపడగా, 'కోడికూర చిట్టిగారే' లో దుమ్ము పట్టిన వాతావరణం, లేబుల్స్ లేని మాంసం కనిపించాయి. అలాగే 'పంచకట్టు దోష', 'సెవెన్ సిస్టర్స్' లాంటి రెస్టారెంట్లలో బల్లి మలం, డ్రైనేజీ పక్కన ఆహారం ఉంచడం లాంటి భయంకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. బయట భోజనం సురక్షితంగా ఉండాలంటే, ప్రతి రెస్టారెంట్ వంటగదిలో కెమెరాలు పెట్టి డైనింగ్ ఏరియాలో లైవ్ స్ట్రీమింగ్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

food poisoninga visit to kanchi cafe could be the end of the story
food poisoninga visit to kanchi cafe could be the end of the story
  • పేరు గొప్ప ఊరు దిబ్బ.. మణికొండ కంచి కెఫేలో దారుణమైన వంటగది

  • ఫుడ్ పాయిజన్ కు అడ్డాగా పేరుమోసిన హోటళ్లు.. తాజా తనిఖీల్లో విస్తుపోయే నిజాలు

  • 'కోడికూర చిట్టిగారే' లో కంపుకొడుతున్న కిచెన్: దుమ్ము, ధూళితో అనారోగ్యాల పంపిణీ!

Food Poisoning: ఇటీవల కాలంలో హోటళ్లలో కల్తీ ఆహారం మరియు ఫుడ్ పాయిజన్ ఘటనలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల్లో తమ ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగింది. బయట తినాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా చాలామంది వినియోగదారులు ఒక అద్భుతమైన సూచన చేస్తున్నారు. ప్రతి రెస్టారెంట్ వంటగది (కిచెన్) లోపల కచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆ దృశ్యాలను కస్టమర్లు భోజనం చేసే డైనింగ్ ఏరియాలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా హోటళ్లలో 'వంటగదిలోకి ఇతరులకు ప్రవేశం లేదు' అనే బోర్డులు కనిపిస్తుంటాయి, దీనివల్ల లోపల కుళ్ళిపోయిన ఆహారాన్ని వండుతున్నారో, లేదా బొద్దింకలు, బల్లులు తిరిగిన వంటలను పెడుతున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. కస్టమర్లకు వంటగది స్పష్టంగా కనిపిస్తేనే ధైర్యంగా తింటారు, లేదంటే ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా అక్కడినుంచి వెళ్లిపోతారు. ఈ పారదర్శకత వస్తేనే బయట భోజనం చేయడం సురక్షితం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇటీవల జరిగిన తనిఖీల్లో కొన్ని పేరొందిన రెస్టారెంట్ల బండారం బట్టబయలైంది. అందులో ముఖ్యంగా మణికొండ, పుప్పాలగూడ ప్రాంతంలో ఎంతో పేరున్న 'కంచి కెఫే' పరిస్థితి చూస్తే ఎవరికైనా వాంతులు రావడం ఖాయం. ఇదొక ప్యూర్ వెజ్ (పూర్తి శాకాహార) రెస్టారెంట్ అని బోర్డు పెట్టుకున్నప్పటికీ, వంటగదిలో ఎటు చూసినా కంపు కొడుతోంది. కిచెన్ మరియు స్టోర్ రూమ్ లలో చెత్తబుట్టలన్నీ మూతలు లేకుండా తెరిచి ఉండి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. స్టోర్ రూమ్ లోని సామాన్లన్నీ విపరీతంగా బూజు పట్టి ఉండటంతో పాటు, చుట్టుపక్కల వాలిన ఈగలన్నీ నేరుగా వండిన ఆహారంపైనే వాలుతున్నాయి. అక్కడ ఎటు చూసినా బొద్దింకలు విరివిగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారు ఇలాంటి హోటళ్లలో భోజనం చేసే ముందు వందసార్లు ఆలోచించుకోవాలి, లేదంటే తిన్న వెంటనే నేరుగా ఆసుపత్రి పాలవ్వక తప్పదు.

కేవలం కంచి కెఫే మాత్రమే కాకుండా, నల్లగండ్లలో ఉన్న ప్రముఖ 'కోడికూర చిట్టిగారే' రెస్టారెంట్ బ్రాంచ్ లో కూడా పరిస్థితులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడ పనిచేసే వంట మనుషులు కనీసం గోళ్లు కూడా శుభ్రంగా కత్తిరించుకోకుండా అత్యంత అపరిశుభ్రంగా వంటలు చేస్తున్నారు. మసాలాలు రుబ్బే గ్రైండింగ్ ప్రదేశాలు మరియు వంటగది సీలింగ్ మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నాయి. ఎక్స్పైరీ అయిపోయి పాడైపోయిన పాత ఆహారాన్ని ఏకంగా ఓపెన్ డ్రైనేజీల్లో పడేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక వంటల్లో వాడే మాంసం, చికెన్ ప్యాకెట్లపై కనీసం లేబుల్స్ లేవు, అవి ఎప్పుడు తెచ్చారు, ఎప్పటి వరకు వాడొచ్చు అనే వివరాలు శూన్యం. వంటగదిలో లెక్కలు చూసుకునే క్యాలిక్యులేటర్లకు కూడా బూజు పట్టిందంటే అక్కడి శుభ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి డెజర్ట్స్, మ్యాంగో పల్ప్ లాంటి వాటికి కూడా ఎలాంటి వివరాలు లేవు.

నిజాంపేటలోని 'పంచకట్టు దోష' బ్రాంచ్ లో సైతం ఆహార పదార్థాల నిల్వపై తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. అక్కడ తయారుచేసే జున్ను, నన్నారి జ్యూస్ లాంటి వాటిపై కనీస తయారీ తేదీల లేబులింగ్ లేదు. అలాగే వంట కోసం తెచ్చిన కాయగూరలు, ఇతర ముడి సరుకులను నేరుగా కింద మురికి నేల పైనే పెడుతున్నారు. వంటగదిలో వాడే డబ్బాలను కనీసం ఏడాదొకసారైనా కడుగుతారా అనే అనుమానం కలిగేలా వాటి పరిస్థితి ఉంది. ఇక హైటెక్స్ ప్రాంతంలోని 'సెవెన్ సిస్టర్స్' రెస్టారెంట్ లో అయితే మాంసానికి కనీస లేబుల్స్ లేకపోవడంతో పాటు, ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ ను చెత్తలో పడేయకుండా అలాగే నిల్వ ఉంచారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, డ్రైనేజీ పక్కన వంట పదార్థాలు పెట్టడం మరియు స్టోర్ రూమ్ లో బల్లి మలం కనిపించడం అక్కడి దారుణ పరిస్థితులకు, యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

ఇలాంటి ప్రముఖ రెస్టారెంట్లు కేవలం డబ్బు సంపాదన కోసం కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరు చూస్తుంటే బయట ఏమీ తినలేని భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. బయటికి ఎంతో ఆకర్షణీయంగా, బ్రహ్మాండమైన లైటింగ్స్ తో కనిపించే ఈ బ్రాండెడ్ హోటళ్ల లోపల వంటగదులు మాత్రం వ్యాధులకు, రోగాలకు నిలయంగా మారుతున్నాయి. అందుకే ప్రతి రెస్టారెంట్ యాజమాన్యం తమ కిచెన్ లోపల నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు పెట్టి, వాటిని డైనింగ్ ఏరియాలోని ఒక పెద్ద టీవీ స్క్రీన్ కు లేదా ప్రొజెక్టర్ కు అనుసంధానం చేయాలి. అలా కిచెన్ లోపలి దృశ్యాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కస్టమర్లకు చూపిస్తేనే ఇలాంటి హోటళ్లపై కాస్తో కూస్తో నమ్మకం కలుగుతుంది. అప్పటివరకు ఈ పరిస్థితులు మారేలా లేవు కాబట్టి, ప్రజలు బయటి ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటూ, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Tags

Be the first to react

More Coverage