⚡ BREAKING
Andhra Pradesh

Vangalapudi Anitha: యువశక్తే దేశానికి పెట్టుబడి.. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం: హోంమంత్రి అనిత

Vangalapudi Anitha: దేశ అభివృద్ధికి యువతే అతిపెద్ద బలమని, ఆ యువశక్తిని మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Vangalapudi Anitha
Vangalapudi Anitha

డ్రగ్స్‌కు నో చెప్పండి.. భవిష్యత్ తరాలను రక్షించండి: హోంమంత్రి పిలుపు..

స్నేహితుల ప్రభావంతో యువత డ్రగ్స్ బారిన పడొద్దు: అనిత హెచ్చరిక..

విజయవాడ: దేశ అభివృద్ధికి యువతే అతిపెద్ద బలమని, ఆ యువశక్తిని మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈగిల్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత దేశానికి అత్యంత విలువైన మానవ వనరులని, వారిని రక్షించడం అంటే భవిష్యత్ తరాలను రక్షించడమేనని అన్నారు. చిన్న అవగాహన లోపం వల్ల కొంతమంది యువత డ్రగ్స్‌కు ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "నివారణే మేలు" అనే సూత్రంతో యువత ముందుగానే జాగ్రత్త పడాలని సూచించారు.

దేశంలో సుమారు 3.5 నుంచి 4 కోట్ల మంది గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా 13 నుంచి 18 ఏళ్ల వయస్సు వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని చెప్పారు. దాదాపు 60 నుంచి 70 శాతం మంది కేవలం స్నేహితుల ఒత్తిడి కారణంగానే డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని, అలాంటి చెడు అలవాట్లు చేసే స్నేహితులు నిజమైన మిత్రులు కాదని హెచ్చరించారు.

తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లలను చదివిస్తున్నారని, వారి ఆశలను యువత వమ్ము చేయవద్దని కోరారు. ఒక్కసారి డ్రగ్స్ అలవాటైతే జీవితంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.

గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన EAGLE (Elite Anti-Narcotics Group for Law Enforcement) టాస్క్ ఫోర్స్ మంచి ఫలితాలు సాధిస్తోందని మంత్రి అభినందించారు. 450 మంది సిబ్బందితో పనిచేస్తున్న ఈగిల్ బృందం గంజాయి నెట్‌వర్క్‌ను కట్టడి చేస్తోందన్నారు.

గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగైన గంజాయి పంటను ధ్వంసం చేసి ప్రస్తుతం జీరో కల్టివేషన్ లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. లిక్విడ్ గంజాయి (హాష్ ఆయిల్) తయారీ కేంద్రాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలను రవాణా చేసినా, దగ్గర ఉంచుకున్నా, వినియోగించినా ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు. పట్టుబడితే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

విజయవాడ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు. డ్రగ్స్ విక్రయాలు లేదా రవాణా గురించి సమాచారం ఉంటే వెంటనే 1972 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ. సూర్యకుమారి మాట్లాడుతూ ధూమపానం, మద్యపానం కంటే డ్రగ్స్ మరింత ప్రమాదకరమని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగం పెరగడం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు.

గతంలో డ్రగ్స్ బారిన పడేవారి సగటు వయస్సు 25 ఏళ్లు ఉండగా, ప్రస్తుతం అది 18 నుంచి 20 ఏళ్లకు తగ్గడం ప్రమాదకర పరిణామమని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా, విక్రయిస్తున్నా ఈగిల్ టీమ్‌కు లేదా 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ నషా ముక్త్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు డ్రగ్స్ నిర్మూలన అవసరమన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగును నియంత్రించామని, డ్రోన్ల నిఘా, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగిల్, ఆపరేషన్ వజ్రాయుధం ద్వారా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ నెట్‌వర్క్‌ను దెబ్బతీశామని వివరించారు.

డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా కోలుకున్న వారిని తిరిగి సమాజంలో భాగస్వాములను చేసి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చాలని సూచించారు.

ఈగిల్ వింగ్ ఎస్పీ కె. నగేష్ కుమార్ మాట్లాడుతూ యువతను కాపాడేందుకు ఈగిల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రగ్స్ రవాణా, సాగు, వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 40 వేలకు పైగా ఈగిల్ క్లబ్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం, డీ-అడిక్షన్ సేవల కోసం 1972 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవాలని కోరారు.

అనంతరం మాదకద్రవ్య రహిత దేశ నిర్మాణానికి కృషి చేస్తానని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను హోంమంత్రి పరిశీలించారు. "సే నో టు డ్రగ్స్" సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా, ఈగిల్ అధికారులు, వైద్యులు, అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

More Coverage