⚡ BREAKING
Andhra Pradesh

Atchennaidu: ఎరువుల పంపిణీలో పారదర్శకతకు APAIMS 2.0 కీలకం.. అక్రమాలకు పూర్తిగా చెక్.. మంత్రి అచ్చెన్నాయుడు!

Atchennaidu: రైతులకు సబ్సిడీ ఎరువులు పారదర్శకంగా, సకాలంలో అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న APAIMS 2.0 వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల పంపిణీపై వస్తున్న దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దని ఆయన సూచించారు.

Atchennaidu
Atchennaidu

రైతు సంక్షేమానికి టెక్నాలజీ బలం.. APAIMS 2.0తో ఎరువుల పంపిణీ సులభతరం..

ఎరువుల అక్రమ మళ్లింపులకు బ్రేక్.. పారదర్శక వ్యవస్థతో రైతులకు న్యాయం..

అమరావతి: రైతులకు సబ్సిడీ ఎరువులు పారదర్శకంగా, సకాలంలో అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న APAIMS 2.0 వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల పంపిణీపై వస్తున్న దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దని ఆయన సూచించారు.

రాష్ట్రంలోని కృష్ణా, కాకినాడ జిల్లాలను మినహాయించి మిగిలిన జిల్లాల్లో జూన్ 8 నుంచి APAIMS 2.0 ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 2,97,733 మంది రైతులకు 48,588 మెట్రిక్ టన్నుల యూరియా, 12,874 మెట్రిక్ టన్నుల డీఏపీ అందించినట్లు తెలిపారు.

ఆధునిక సాంకేతికత ఆధారంగా పనిచేస్తున్న APAIMS 2.0 ద్వారా నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు చేరేలా చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. రైతు సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా అవసరమైన మోతాదులో ఎరువులు అందిస్తున్నట్లు తెలిపారు.

ఎరువుల అక్రమ నిల్వలు, మళ్లింపులు, రైతులు కాని వారికి విక్రయాలు వంటి సమస్యలను పూర్తిగా అరికట్టేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతోందన్నారు. ఎరువుల నిల్వలు, సరఫరా, పంపిణీపై రియల్‌టైమ్ పర్యవేక్షణ జరుగుతోందని, iFMS, APAIMS, భౌతిక నిల్వల వివరాలను సమన్వయం చేసి ఖచ్చితమైన నిర్వహణ చేస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత రాకుండా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కౌలు రైతులతో సహా అర్హులైన ప్రతి రైతుకు సమానంగా అవకాశం కల్పించేలా ఈ వ్యవస్థ రూపొందించామని తెలిపారు. ఎరువుల కొరత, అధిక ధరలు లేదా పంపిణీ సమస్యలపై రైతులు టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

APAIMS 2.0 ప్రారంభ దశలో ఎదురైన కొన్ని సాంకేతిక సమస్యలు ఎక్కువగా పరిష్కరించామని, OTP లేదా సర్వర్ సమస్యలు వస్తే ప్రత్యేక బృందాలు 24 గంటలూ పర్యవేక్షిస్తూ పరిష్కరిస్తున్నాయని మంత్రి చెప్పారు.

గతంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో జరిగిన అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే ఈ విధానం తీసుకొచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. పారదర్శక వ్యవస్థ అమలుతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని, అందుకే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులు వాస్తవాలను తెలుసుకుని ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరారు.

రాష్ట్రంలో టమాటా ధరలు పూర్తిగా పడిపోయాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీల అధికారిక ధరలు పరిశీలిస్తే టమాటా ధరలు స్థిరంగానే ఉన్నాయని తెలిపారు.

జూన్ 25న ములకలచెరువు మార్కెట్‌లో 10 కిలోల టమాటాకు కనిష్ఠ ధర రూ.100, గరిష్ఠ ధర రూ.210, మోడల్ ధర రూ.180 నమోదైనట్లు చెప్పారు. గుర్రంకొండ సబ్ మార్కెట్ యార్డులో కనిష్ఠ ధర రూ.112, గరిష్ఠ ధర రూ.192, మోడల్ ధర రూ.152గా ఉందని వివరించారు.

అసత్య ప్రచారాలు రైతుల్లో ఆందోళన కలిగించడంతో పాటు మార్కెట్ పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని మంత్రి అన్నారు. రైతులు అధికారిక గణాంకాలను మాత్రమే విశ్వసించాలని సూచించారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని జైన్ మ్యాంగో పల్ప్ యూనిట్‌పై వస్తున్న ప్రచారాన్ని కూడా మంత్రి ఖండించారు. రెండు యూనిట్లలో ఒకటి నిరంతరంగా పనిచేస్తుండగా, మరో యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించి తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. మామిడి అన్‌లోడింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, రైతులకు అవసరమైన సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Tags

Be the first to react

More Coverage