Nimmala Ramanaidu: సీమ సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట.. రెండేళ్లలో రూ.27 వేల కోట్ల వ్యయం!

Nimmala Ramanaidu: కరువు, వెనుకబాటుతనంతో సతమతమైన రాయలసీమకు సాగు, తాగునీటిని అందించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రతనాలసీమగా వెలిగిన ప్రాంతాన్ని మళ్లీ అభివృద్ధి బాటలో నడిపించేందుకు నాడు ఎన్టీఆర్ వేసిన పునాదులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ పూర్తి చేస్తున్నారని చెప్పారు.

Nimmala Ramanaidu
Nimmala Ramanaidu

సీమకు పూర్వ వైభవం తీసుకొచ్చేది కూటమి ప్రభుత్వమే: మంత్రి నిమ్మల రామానాయుడు..

శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం: నిమ్మల..

మంత్రాలయం: కరువు, వెనుకబాటుతనంతో సతమతమైన రాయలసీమకు సాగు, తాగునీటిని అందించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రతనాలసీమగా వెలిగిన ప్రాంతాన్ని మళ్లీ అభివృద్ధి బాటలో నడిపించేందుకు నాడు ఎన్టీఆర్ వేసిన పునాదులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ పూర్తి చేస్తున్నారని చెప్పారు.

మంగళవారం మంత్రాలయం నియోజకవర్గంలో నిర్వహించిన మంత్రుల అవుట్‌రీచ్ కార్యక్రమంలో మంత్రి రామానాయుడు మాట్లాడారు. రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందిస్తేనే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందనే ఆలోచనతో ఎన్టీఆర్ హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ, గోరకల్లు, గండికోట వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వాటిని పూర్తి చేసే బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం తీసుకుందని అన్నారు.

రాయలసీమకు ఎవరు ఏం చేశారో ప్రజలే నిర్ణయించాలి
రాయలసీమ ప్రయోజనాలపై వైసీపీ నాయకులు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద ధర్నా చేయడాన్ని మంత్రి విమర్శించారు. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్థానాల్లో 49 సీట్లు వైసీపీకి ప్రజలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ ఐదేళ్ల పాలనలో ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మాత్రం సుమారు రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. రాయలసీమ సాగు, తాగునీటి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఇందులో దాదాపు 50 శాతం నిధులను రాయలసీమలోని నాలుగు జిల్లాలకు కేటాయించినట్లు వివరించారు.

శ్రీశైలం, తుంగభద్రకు ప్రత్యేక ప్రాధాన్యం
రాయలసీమకు శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు గుండెకాయ వంటివని రామానాయుడు అన్నారు. ఈ రెండు రిజర్వాయర్లలో నీరు ఉంటేనే రాయలసీమలోని అనేక సాగునీటి ప్రాజెక్టులు పనిచేస్తాయని చెప్పారు.

శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు పనులకు రూ.203 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

తుంగభద్ర ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 19వ గేటు కొట్టుకుపోయిన సమయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులెత్తేసిన పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం స్పందించిందన్నారు. ఏపీ నుంచి కన్నమ నాయుడిని పంపించి గేటును మరమ్మతు చేయించడం ద్వారా తుంగభద్ర పరివాహక ప్రాంతంలోని పంటలను కాపాడామని తెలిపారు. 

అంతేకాకుండా తుంగభద్ర డ్యాం శాశ్వత పటిష్టత కోసం మొత్తం 33 గేట్లను మార్చామని చెప్పారు. ఇటీవల ముగ్గురు ముఖ్యమంత్రులతో వాటిని ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

గోరకల్లు, హంద్రీనీవా ప్రాజెక్టులకు నిధులు
కడప జిల్లాలోని పులివెందులకు నీరు అందించాలంటే గోరకల్లు రిజర్వాయర్‌ను పటిష్టం చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గోరకల్లు రిజర్వాయర్‌కు రూ.60 కోట్లు కేటాయించిందన్నారు.

చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఎంతో కీలకమని తెలిపారు. హంద్రీనీవాను పూర్తి చేసి కుప్పం వరకు నీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. గత ప్రభుత్వం హంద్రీనీవా పనులను ముందుకు తీసుకెళ్లకపోగా విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేదని ఆరోపించారు.

రాయలసీమ అభివృద్ధి కంటే గత పాలకులు వనరులను ఎలా వినియోగించుకోవాలనే దానిపైనే దృష్టి పెట్టారని మంత్రి విమర్శించారు. రాయలసీమ ముద్దుబిడ్డగా చంద్రబాబు నాయుడికే గౌరవం దక్కుతుందని అన్నారు.

వెలిగొండతో ప్రకాశం జిల్లాకు ఊరట 
కరువు, ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు మూడు దశాబ్దాల కల అని రామానాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును ఈ నెల 31న ఆయన చేతుల మీదుగానే ప్రారంభించబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి రంగానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

కర్నూలు పశ్చిమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక 
కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి బాధ్యతను తాను, నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి తీసుకుంటామని రామానాయుడు హామీ ఇచ్చారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రూ.1,600 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వేదావతి ప్రాజెక్టును 2029 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. గుండ్రేవుల, ఆర్డీఎస్, రాజోలిబండ డైవర్షన్ పథకాలు కూడా ఈ ప్రాంతానికి ఎంతో అవసరమని చెప్పారు.

అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు. కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
టీడీపీకి, బీసీలకు విడదీయరాని అనుబంధం ఉందని మంత్రి అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పెంచి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. దీనివల్ల స్థానిక సంస్థల్లో సుమారు 16 వేల పదవులను బీసీలు నష్టపోయారని పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం నుంచి రాఘవేంద్ర రెడ్డిని మెజారిటీతో గెలిపించాలని మంత్రి ప్రజలను కోరారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు, ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest