Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్.. 5,499 హెక్టార్లలో తీర ప్రాంత రక్షణకు తాటి చెట్లు!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచం ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ కార్యక్రమంలో కీలక అడుగు పడింది. తీర ప్రాంతాల్లో తాటి వనాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. తుపాన్లు, బలమైన సముద్ర గాలుల సమయంలో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేసేలా ఈ ప్రణాళికను రూపొందించారు.
పవన్ కళ్యాణ్ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రణాళిక.. తీర ప్రాంత రక్షణకు తాటి చెట్లు..
తుపాన్లకు చెక్ పెట్టేలా తాటి వనాలు.. ఏపీలో భారీ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచం ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ కార్యక్రమంలో కీలక అడుగు పడింది. తీర ప్రాంతాల్లో తాటి వనాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. తుపాన్లు, బలమైన సముద్ర గాలుల సమయంలో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేసేలా ఈ ప్రణాళికను రూపొందించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ రూపొందించిన మూడంచెల గ్రేట్ గ్రీన్ వాల్‌లో మొదటి అంచెలో మడ అడవులు, రెండో అంచెలో తాటి వనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తీర గ్రామాలను ప్రకృతి విపత్తుల ప్రభావం నుంచి కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఈ వనాలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
5,499 హెక్టార్లలో తాటి వనాలు
రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5,499 హెక్టార్ల విస్తీర్ణంలో తాటి వనాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం దాదాపు 55 లక్షల తాటి గింజలు అవసరమవుతాయని అటవీ శాఖ అంచనా వేసింది.
తాటి కాయల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామీణ ప్రజలు, వివిధ ప్రభుత్వ విభాగాలు, ఇతర సంస్థల సహకారంతో 13 లక్షల తాటి గింజలను సేకరించారు. ఇందులో ఇప్పటికే 1.65 లక్షల గింజలను నాటే ప్రక్రియ పూర్తయింది. పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు, పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సీజన్‌లో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో అటవీ శాఖ చర్యలను వేగవంతం చేసింది.
తీర ప్రాంతానికి తాటి చెట్లు ఎందుకు?
తీర ప్రాంతాల్లో ఉప్పునీరు, ఇసుక, బుసకతో కూడిన నేలలు, బలమైన సముద్ర గాలులు సాధారణం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ తాటి చెట్లు పెరిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. తాటి చెట్లు ఎత్తుగా పెరగడంతో సముద్రం నుంచి వచ్చే బలమైన గాలుల వేగాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వాటి బలమైన వేర్లు నేలను గట్టిగా పట్టుకుని ఉండటంతో తీర ప్రాంత నేల కోతను తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి.
అంతేకాదు.. తాటి చెట్లు పక్షులు, కొన్ని రకాల సరీసృపాలకు ఆవాసంగా నిలుస్తాయి. దీంతో తీర ప్రాంత జీవ వైవిధ్యాన్ని కాపాడటంలోనూ ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం కూడా తాటి చెట్లకు ఉండటంతో వీటిని గ్రేట్ గ్రీన్ వాల్‌లో భాగంగా ఎంపిక చేశారు.
ప్రజల భాగస్వామ్యంతోనే లక్ష్యం సాధ్యం
తాటి గింజల సేకరణ, నాటడం, మొక్కల సంరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని కోరారు. తీర ప్రాంతాల్లో అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి శాస్త్రీయ పద్ధతిలో తాటి గింజలను నాటాలని సూచించారు. మొలకెత్తిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత కూడా స్థానికులపై ఉందన్నారు.
ముఖ్యంగా మొలకెత్తిన తాటి మొక్కల వద్దకు పశువులను వెళ్లకుండా చూడాలని, మొక్కలు దెబ్బతినకుండా స్వీయ సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సహజ సంపదను కాపాడే కార్యక్రమంలో అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.
పర్యావరణ పునరుద్ధరణకు పెద్ద అడుగు
గ్రేట్ గ్రీన్ వాల్‌తో పాటు రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించడం, పర్యావరణ పునరుద్ధరణ, సహజ వనరుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. తాటి వనాల పెంపకం కేవలం చెట్లను నాటే కార్యక్రమంగా కాకుండా.. తీర ప్రాంత భద్రత, నేల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే దీర్ఘకాలిక చర్యగా అధికారులు భావిస్తున్నారు.
భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో తీర ప్రాంతం వెంట పచ్చదనం పెంచి, ప్రకృతి విపత్తుల నుంచి గ్రామాలకు మరింత రక్షణ కల్పించడమే గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
Tags
Be the first to react