Missing Fishermen: గల్లంతైన 7 మంది మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు.. 15 కోస్ట్‌గార్డ్ నౌకలు, 4 హెలికాప్టర్లు రంగంలోకి!
Missing Fishermen: అమలాపురం ప్రాంతానికి చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రంలో గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. భారత తీర రక్షక దళం (ICG), నౌకాదళం, ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో విస్తృత సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
అమలాపురం మత్స్యకారుల ఆచూకీ కోసం విస్తృత సెర్చ్ ఆపరేషన్.. మంత్రి అచ్చెన్నాయుడు..
సముద్రంలో గల్లంతైన 7 మంది మత్స్యకారులు.. గాలింపు పరిధి మరింత విస్తరణ..
అమరావతి: అమలాపురం ప్రాంతానికి చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రంలో గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. భారత తీర రక్షక దళం (ICG), నౌకాదళం, ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో విస్తృత సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారులను సురక్షితంగా కుటుంబాల వద్దకు తీసుకురావడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు.
15 కోస్ట్‌గార్డ్ నౌకలు, నాలుగు హెలికాప్టర్లతో గాలింపు
గాలింపు పరిధిని మరింత విస్తరించేందుకు మంగళవారం 15 ఐసీజీ నౌకలు, నాలుగు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. కోల్‌కతాలోని తూర్పు, ఈశాన్య కమాండ్లను కూడా సెర్చ్ ఆపరేషన్‌లో భాగస్వామ్యం చేసినట్లు మంత్రి తెలిపారు.
ఐసీజీ ప్రధాన కార్యాలయంలోని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. మెరైన్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ నిఘా కూడా కొనసాగుతోందన్నారు.
మయన్మార్, బంగ్లాదేశ్ అధికారులకు సమాచారం
గల్లంతైన పడవ సముద్ర ప్రవాహాల కారణంగా విదేశీ జలాల్లోకి కొట్టుకుపోయి ఉండవచ్చనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మయన్మార్, బంగ్లాదేశ్ సముద్ర అధికారులను అప్రమత్తం చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.
పడవ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి సముద్రంలో ఎక్కడైనా నిలిచిపోయి ఉండే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వివిధ సముద్ర అధికారుల నుంచి వస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు.
సముద్ర ప్రవాహాలు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా సెర్చ్
గాలింపు చర్యల్లో సముద్ర ప్రవాహాలు, గాలుల దిశ, గాలి వేగం, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. మత్స్యకారులు సాధారణంగా చేపల వేటకు వెళ్లే మార్గాలను కూడా పరిశీలనలోకి తీసుకున్నామని తెలిపారు.
డైమండ్ హార్బర్, సుందర్‌బన్స్ పరిసర సముద్ర ప్రాంతాల్లోనూ సెర్చ్ ఆపరేషన్‌ను విస్తరించినట్లు చెప్పారు. సముద్రంలో గాలింపు చర్యలను వేగవంతం చేసేందుకు సంబంధిత అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
కేంద్రంతో సమన్వయం
అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి మంగళవారం కేంద్ర రక్షణ మంత్రిని కలిసి గల్లంతైన మత్స్యకారుల కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ భారత తీర రక్షక దళాన్ని మరింత అప్రమత్తం చేసిందని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటోందన్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం అన్ని మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
కుటుంబాలకు మంత్రి భరోసా
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. “మత్స్యకారులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగిస్తున్నాం” అని తెలిపారు.
గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, ఆచూకీ లభించే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని సముద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నిఘా కొనసాగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
Tags
Be the first to react