Godavari Pushkaralu: అఖండ గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. 10 కోట్ల మంది భక్తుల అంచనా!
Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలను ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన కలిసేలా అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భక్తుల పవిత్రత, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని సూచించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించనున్నారు.
గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. రూ.4,026 కోట్లతో 4,932 పనులు..
2027 గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది భక్తుల అంచనా.. భారీ ఏర్పాట్లు..
అమరావతి: గోదావరి పుష్కరాలను ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన కలిసేలా అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భక్తుల పవిత్రత, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని సూచించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించనున్నారు.
పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం రూ.4,026 కోట్లతో 4,932 పనులు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. పుష్కరాలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉన్నందున పనులను వేగంగా ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ వద్దని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ పనులకు రూ.899 కోట్లు ఆర్థిక శాఖ కేటాయించినట్లు అధికారులు తెలిపారు. పట్టణాభివృద్ధి, ఆర్‌అండ్‌బీ, జలవనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల్లో అత్యధిక పనులు చేపడుతున్నారు.
ఆరు జిల్లాల్లో 4,932 పనులు
పుష్కరాల కోసం తూర్పుగోదావరి జిల్లాలో 1,869, పశ్చిమగోదావరిలో 625, కోనసీమలో 1,501, ఏలూరులో 426, కాకినాడలో 321, పోలవరం జిల్లాలో 190 పనులు చేపడుతున్నారు. పనులకు అవసరమైన నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణలో స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు.
10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం
2015 మహా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4.86 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. 2027 పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రోజుకు సుమారు కోటి మంది వరకు పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందని తెలిపారు.
భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని మొత్తం 440 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు మరో 181 కొత్త ఘాట్లు నిర్మించనున్నారు. జిల్లాల వారీగా తూర్పుగోదావరిలో 82, పశ్చిమగోదావరిలో 40, కోనసీమలో 175, ఏలూరులో 44, కాకినాడలో 88, పోలవరంలో 11 ఘాట్లను అభివృద్ధి చేస్తున్నారు.
ఆలయాలు, పర్యాటక ప్రాంతాలతో ప్రత్యేక సర్క్యూట్
గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టెంపుల్ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. పిఠాపురం శక్తిపీఠం, నాలుగు పంచారామ క్షేత్రాలు, ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రాంతాలను ఈ సర్క్యూట్‌లో అనుసంధానించాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా హోమ్‌స్టేలను ప్రోత్సహించాలని చెప్పారు. కొత్త హోటళ్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని సూచించారు.
రాజమహేంద్రవరంలో కన్వెన్షన్ సెంటర్
రాజమహేంద్రవరంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు అనువుగా కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని సీఎం ఆదేశించారు. దేశ, విదేశాల్లోని ప్రముఖులను పుష్కరాలకు ఆహ్వానించాలని చెప్పారు.
రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచానికి చాటేలా పుష్కరాలను ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కూచిపూడి వంటి సాంస్కృతిక కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు దేవాదాయ, పర్యాటక శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
రోడ్లు, వంతెనలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
పుష్కర ఘాట్లను అనుసంధానించే రహదారులను అభివృద్ధి చేయాలని సీఎం తెలిపారు. పుష్కరాలు జరిగే ఆరు జిల్లాల్లో రోడ్లపై గుంతలు కనిపించకూడదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించేలా రహదారులను అభివృద్ధి చేయాలని సూచించారు. వంతెనల సామర్థ్యాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
గోదావరిలోకి చుక్క మురుగు నీరు కూడా చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హేవ్‌లాక్ బ్రిడ్జి, దాని సమీపంలోని దీవుల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఏఐతో రద్దీ నియంత్రణ
2027 పుష్కరాల్లో భద్రత, రద్దీ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ఏఐ ఆధారిత క్రౌడ్ అనలిటిక్స్, సీసీటీవీ ఎంట్రీ-ఎగ్జిట్ మానిటరింగ్, డ్రోన్ సర్వైలెన్స్, క్యూఆర్ ఆధారిత వాహన గుర్తింపు, డీసెంట్రలైజ్డ్ డిప్లాయ్‌మెంట్ సిస్టమ్ వంటి విధానాలను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
వైద్య సేవలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంబులెన్స్‌లు, ఫస్ట్‌ఎయిడ్ కేంద్రాలు, మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంచనున్నారు. 30 తాత్కాలిక ఫీల్డ్ ఆస్పత్రులు, వాటికి అనుబంధంగా ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
మోడల్ పుష్కర పంచాయతీగా ముని కూడలి
గోదావరి పరివాహక జిల్లాల్లోని 260 గ్రామ పంచాయతీల్లో 50 పంచాయతీలను మోడల్ పుష్కర పంచాయతీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ముని కూడలిని పైలట్ మోడల్ పుష్కర పంచాయతీగా ఎంపిక చేశారు.
కొవ్వూరు–పోలవరం మీదుగా పట్టిసీమ రోడ్డు, సీతానగరం నుంచి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వరకు బీటీ రోడ్డు, అవెన్యూ ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టనున్నారు. కాటన్ బ్యారేజ్ నుంచి కొవ్వూరు వరకు రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. రాజమహేంద్రవరం–పోలవరం మధ్య జాతీయ రహదారి అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
487 గ్రీన్ ఎనర్జీ బస్సులు
పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించేందుకు 487 గ్రీన్ ఎనర్జీ బస్సులను వినియోగించనున్నారు. మరోవైపు 11 బస్‌స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. నదిలో భక్తుల భద్రత కోసం 2,697 రెస్క్యూ బోట్లు, 8,955 మంది శిక్షణ పొందిన ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు.
‘అఖండ గోదావరి’ పేరుతో పుష్కరాల నిర్వహణపై పరిశీలన
గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు కలుస్తున్నందున పుష్కరాలను ‘అఖండ గోదావరి’ పేరుతో నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు.
దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, భద్రత, వసతి, సాంకేతిక సదుపాయాల్లో సమగ్ర ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. ప్రకృతి ఆరాధనతో పాటు ఆధ్యాత్మికత, పర్యాటకం, సంస్కృతి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పుష్కరాలను నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, వై. సత్యకుమార్ యాదవ్, గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారి, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags
Be the first to react