Veligonda Project: ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

Veligonda Project: మూడు దశాబ్దాల క్రితం తాను తీసుకున్న సంకల్పం ఇప్పుడు సాకారం అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1ను పూర్తి చేసి కరువు ప్రాంతానికి కృష్ణా జలాలను అందించబోతున్నామని తెలిపారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

Veligonda Project
Veligonda Project

వెలిగొండ జలసిరులు.. అభివృద్ధికి రెక్కలు: సీఎం చంద్రబాబు..

వెలిగొండ నుంచి 10.7 టీఎంసీల కృష్ణా జలాలు.. నల్లమల సాగర్‌కు విడుదల..

అమరావతి: మూడు దశాబ్దాల క్రితం తాను తీసుకున్న సంకల్పం ఇప్పుడు సాకారం అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1ను పూర్తి చేసి కరువు ప్రాంతానికి కృష్ణా జలాలను అందించబోతున్నామని తెలిపారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. అప్పటి ఫొటోను కూడా తన పోస్టుకు జత చేశారు. ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లను అధిగమించి భగీరథ ప్రయత్నంతో ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేశామని పేర్కొన్నారు.

10.7 టీఎంసీల కృష్ణా జలాలు
ఈ నెల 31న మార్కాపురం జిల్లా వేదికగా వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. తరతరాలుగా కరువుతో పోరాడుతున్న ప్రజలకు ఈ జలాలు ఉపశమనం కలిగిస్తాయని అన్నారు.

ఫేజ్‌-1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు, ఫేజ్‌-2 పూర్తయితే 3.283 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. దీనితో పాటు లక్షలాది మందికి తాగునీరు అందే అవకాశం ఉంటుందని వివరించారు.

మార్కాపురానికి వెలుగుల దండ
తీవ్ర కరువు, వెనుకబాటుతనంతో ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలను మార్చడమే వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు.

“దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ వెలుగుల దండ అవుతుంది” అని ఆయన అభివర్ణించారు. కృష్ణా జలాలతో నెర్రలు బారిన నేలను తడిపి, ఈ ప్రాంతంలో సాగు, జీవనోపాధికి కొత్త ఊపునిస్తామని తెలిపారు.

ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వెలిగొండ జలసిరులు ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడుగుతాయని సీఎం పేర్కొన్నారు. నీరు అందుబాటులోకి రావడంతో జీవితం, వ్యవసాయం రెండూ మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మార్కాపురం జిల్లా ఏర్పాటు.. మరో సంకల్పం
పశ్చిమ ప్రకాశం ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్‌ హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

హైవేలు, పోర్టులతో కొత్త అవకాశాలు
ప్రాంతంలో లాజిస్టిక్స్‌ సమస్య లేకుండా జాతీయ రహదారులు, పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు. బెంగళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టు ద్వారా వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కొత్త అవకాశాలు వస్తాయని చెప్పారు. నీరు, రవాణా సదుపాయాలు, పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాలు కలిసి పశ్చిమ ప్రకాశం ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మను తీసుకువచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

“ప్రతి రైతు పొలానికి నీరు.. ప్రతి యువకుడికి ఉపాధి”
ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే ‘సీబీఎన్‌ అనే నేను’ సంకల్పం అని చంద్రబాబు పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు కేవలం నీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, ప్రాంతీయ అభివృద్ధికి పునాది అని ఆయన స్పష్టం చేశారు. నీటి లభ్యతతో వ్యవసాయం, ఉద్యాన పంటలు, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంటుందని తెలిపారు.

చివరగా ప్రతి పౌరుడు ‘నేను’ అనే స్ఫూర్తితో పనిచేసి వ్యక్తిగత విజయాలను సాధించడంతో పాటు దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మూడు దశాబ్దాల కల సాకారమవుతున్న నేపథ్యంలో వెలిగొండ జలాలు పశ్చిమ ప్రకాశం భవిష్యత్తుకు కొత్త ఆశలు కల్పించనున్నాయని సీఎం పేర్కొన్నారు.

Tags

Be the first to react

Latest