AP Budget: ఏపీ టూరిజంకి కేంద్రం బిగ్ బూస్ట్... రూ. 1,800 కోట్ల మెగా ప్యాకేజీ! రూ. 1,000 కోట్లతో అది ఒక్కటే...
AP Budget: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కేంద్ర ప్రభుత్వం రూ. 1,800 కోట్ల ప్రాథమిక నిధుల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. దీని ద్వారా అరకు లోయలో 103 కిలోమీటర్ల ట్రెకింగ్ ట్రాక్ మరియు పులికాట్ సరస్సులోని ఇరుక్కం ఐలాండ్‌లో 80 ఎకరాల 'టెంట్ సిటీ' ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి.
- నెల్లూరు సరిహద్దుల్లో 18 కిలోమీటర్ల ఎకో-బోటింగ్ కారిడార్!
- 103 కిలోమీటర్ల డేంజరస్ ట్రెకింగ్ ట్రాక్!
- పులికాట్ సరస్సు మధ్యలో 80 ఎకరాల 'టెంట్ సిటీ'!
AP Budget: రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల ప్రకారం, అరకు ప్రాంతంలో ప్రకృతి పర్యాటకాన్ని (Nature Tourism) ప్రోత్సహించేందుకు రూ. 1,000 కోట్లు, నెల్లూరు సరిహద్దుల్లోని పులికాట్ సరస్సు అభివృద్ధికి రూ. 800 కోట్లు కేటాయించారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సమర్పణ ప్రక్రియ పూర్తయిన వెంటనే దశలవారీగా కేంద్రం నిధులు విడుదల చేయనుంది. దీని ద్వారా విదేశీ మరియు స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రపంచస్థాయి మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
అరకు వ్యాలీ ప్రాజెక్టు కింద మొత్తం 103 కిలోమీటర్ల పొడవైన అద్భుతమైన ట్రెకింగ్ మార్గాన్ని (Trekking Trail) ఆరు ప్రధాన భాగాలుగా విభజించి డెవలప్ చేయనున్నారు. వీటిలో 24 కిమీ అనంతగిరి కాఫీ రిడ్జ్ ట్రైల్, 23 కిమీ గోరాపూర్ వ్యాలీ ట్రైల్, 21 కిమీ ఫారెస్ట్ అండ్ వాటర్‌ఫాల్ ట్రైల్, తూర్పు కనుమలలోనే అత్యంత ఎత్తైన ఆర్మాకొండ సమిట్ ట్రైల్ (16 కిమీ), కాకరపాడు గుహల మార్గం మరియు టంకోట జలపాతం ట్రాక్‌లు ఉన్నాయి. పర్యాటకుల భద్రత కోసం హెల్ప్ సెంటర్లు, గిరిజన సాంస్కృతిక కేంద్రాలు, ఫుడ్ కోర్టులు మరియు సేఫ్ స్టే నివాసాలను ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దున ఉన్న దేశంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు 'పులికాట్' అభివృద్ధి కోసం రూ. 800 కోట్లతో ఎకో-టూరిజం ప్లాన్‌ను సిద్ధం చేశారు. విదేశీ పక్షులను సందర్శించే బర్డ్ వాచర్స్ మరియు పర్యాటకుల కోసం కదిరి, అలకాని తిప్ప, శ్రీహరికోట మరియు వేనాడులను అనుసంధానిస్తూ 20 కిలోమీటర్ల రహదారి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా బి.వి. పాలెం నుండి ఇరుక్కం ద్వీపం వరకు 18 కిలోమీటర్ల ఎకో-బోటింగ్ కారిడార్‌ను డెవలప్ చేయనున్నారు.
పులికాట్ సరస్సులోని ఇరుక్కం ఐలాండ్‌లో దాదాపు 80 ఎకరాల వైశాల్యంలో 'టెంట్ సిటీ' (Tent City) ప్రాజెక్టును నిర్మించి, పర్యాటకులు రాత్రివేళల్లో ప్రకృతి ఒడిలో బస చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. నేలపట్టు పక్షుల అభయారణ్యం పరిధిలో 2 కిలోమీటర్ల సుందరమైన వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్‌తో పాటు పర్యాటకులు సంచరించేందుకు ఈవీ బగ్గీలను (EV Buggies) అందుబాటులోకి తేనున్నారు.
విశాఖపట్నం, అమరావతి, తిరుపతి రీజియన్లను పారిశ్రామికంగా, ఐటీ పరంగా అభివృద్ధి చేస్తున్న తరుణంలో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని, వారికి ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడమే ఈ మెగా ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం.
Tags
Be the first to react