మురసు తుఫాన్ విధ్వంసం.. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలు అతలాకుతలం!
AP Cyclone Murasu: ఆంధ్రప్రదేశ్లో మురసు తుఫాన్ ఉమ్మడి గుంటూరు జిల్లాను అతలాకుతలం చేసింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కుండపోత వర్షాలు, ప్రచండ ఈదురుగాలులు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. గంటకు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులపై చెట్లు పడిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం.
- మురసు తుఫాన్ ధాటికి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడగా.. మరికొందరు గల్లంతయ్యారు.
- భారీ వర్షాలు, ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో పంట నష్టం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు.
AP Cyclone Murasu: ఆంధ్రప్రదేశ్లో మురసు తుఫాన్ ఉమ్మడి గుంటూరు జిల్లాను అతలాకుతలం చేసింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కుండపోత వర్షాలు, ప్రచండ ఈదురుగాలులు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. గంటకు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులపై చెట్లు పడిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం.
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసం
మురసు తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 4.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిలకలూరిపేట పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది. చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడ్లపాడు మండలంలో అత్యధికంగా 26.82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తిమ్మాపురం సమీపంలో నక్కవాగు ఉప్పొంగడంతో ఓ కారు వరద నీటిలో చిక్కుకుంది. అందులో ఉన్న ఐదుగురిలో ముగ్గురిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకురాగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సత్తెనపల్లిలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఇళ్లలోకి కూడా నీరు చేరింది. నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లడంతో పత్తి, మిరపతో పాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
బాపట్ల జిల్లాను వణికించిన ఈదురుగాలులు
బాపట్ల జిల్లాలో మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపి లేని వర్షాలు, ఈదురుగాలులతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బాపట్ల, చీరాల పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తీర ప్రాంతాల్లోని 19 గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
ప్రచండ గాలులకు జిల్లావ్యాప్తంగా సుమారు 800 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం.
చీరాల ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. భారీ వర్షాల కారణంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. వాడరేవు, రామాపురం, కఠారిపాలెం తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఎమ్మెల్యే కొండయ్య తీర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, ఎద్దనపూడి మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిన్నగంజాం టోల్ ప్లాజా వద్ద ఈదురుగాలుల ధాటికి ఇనుప కంటైనర్ కూలిపడింది. ఈ ఘటనలో టోల్ సిబ్బంది అగస్టిన్ మృతి చెందారు. మరోవైపు భారీ విద్యుత్ స్తంభం రోడ్డుపై పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లా వ్యాప్తంగా సుమారు 70 వేల ఎకరాల్లో వరి పంట, 16,450 ఎకరాల్లో ఉద్యాన పంటలు నీటమునిగినట్లు అంచనా. చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలోనూ వరద బీభత్సం
గుంటూరు జిల్లాలోనూ మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపి లేని వర్షాలకు నగర శివారు కాలనీలు జలమయమయ్యాయి. ఫిరంగిపురంలో 17.28 సెంటీమీటర్లు, గుంటూరు పశ్చిమలో 13.74, కాకుమానులో 13.32, పెదకానిలో 13.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో వాగులు పొంగిపొర్లడంతో గొట్టిపాడు, వింజనంపాడు ప్రాంతాల్లో మిరప, పత్తి పంటలు నీటమునిగాయి. కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. నల్లమడ వాగుకు భారీగా వరద నీరు చేరడంతో పరిసర ప్రాంతాల్లోని వరి పొలాలు నీటిలో మునిగిపోయాయి. పెదనందిపాడులో పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.
జిల్లా వ్యాప్తంగా 39 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2,316 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
మంగళగిరిలో హైవేపై నిలిచిన వాహనాలు
మంగళగిరి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కాజా టోల్ ప్లాజా సమీపంలో వరద నీరు జాతీయ రహదారిపైకి చేరింది. దీంతో విజయవాడ వైపు వెళ్లే రెండు మార్గాలను అధికారులు మూసివేశారు. హైవేపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు రైళ్ల రాకపోకలపైనా తుఫాన్ ప్రభావం పడింది. పలు రైళ్లను నిలిపివేయడంతో బాపట్ల రైల్వే స్టేషన్లో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. గుంటూరు రైల్వే స్టేషన్లో చిక్కుకున్న సుమారు 2 వేల మంది ప్రయాణికులకు తహసీల్దార్ ఆధ్వర్యంలో అధికారులు ఆహారం పంపిణీ చేశారు.
రంగంలోకి దిగిన సహాయక బృందాలు
మురసు తుఫాన్ కారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రహదారులపై పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Be the first to react