Nara Lokesh: ఏపీలో ఎండ్-టు-ఎండ్ పీసీబీ క్లస్టర్ నిర్మాణానికి కలిసి పనిచేయండి.. షిన్హ్యుప్ ఎలక్ట్రానిక్స్కు మంత్రి లోకేష్ ఆహ్వానం!
Nara Lokesh: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. పర్యటనలో భాగంగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (PCB) తయారీలో ప్రముఖ సంస్థ షిన్హ్యుప్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ టేహూ కిమ్, ఇంజనీరింగ్ అడ్హెసివ్ (EA) ప్రతినిధి షిబ్లీ అహమ్మద్తో సియోల్లో సమావేశమయ్యారు.
షిన్హ్యుప్ ఎలక్ట్రానిక్స్తో మంత్రి లోకేష్ కీలక భేటీ.. ఏపీలో భారీ పెట్టుబడులపై చర్చ..
నాయుడుపేటలో రూ.1,595 కోట్ల పీసీబీ ప్లాంట్.. 2,170 మందికి ఉద్యోగాలు..
సియోల్: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. పర్యటనలో భాగంగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (PCB) తయారీలో ప్రముఖ సంస్థ షిన్హ్యుప్ ఎలక్ట్రానిక్స్ (Shinhyup Electronics Co., Ltd.) ఛైర్మన్ టేహూ కిమ్, ఇంజనీరింగ్ అడ్హెసివ్ (EA) ప్రతినిధి షిబ్లీ అహమ్మద్తో సియోల్లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, షిన్హ్యుప్ ఎలక్ట్రానిక్స్ తమ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ను ఎంచుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న పీసీబీ ఎకోసిస్టమ్ వేగంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు.
ఇప్పటికే సిర్మా, జెట్వర్క్, ఎపిటోమ్, సిప్సా టెక్ వంటి నాలుగు సంస్థలు నాయుడుపేటలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎండ్-టు-ఎండ్ పీసీబీ క్లస్టర్ అభివృద్ధికి షిన్హ్యుప్ ఎలక్ట్రానిక్స్ ప్రభుత్వం తోడ్పాటును అందించాలని మంత్రి లోకేష్ కోరారు.
సమావేశంలో షిన్హ్యుప్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ టేహూ కిమ్ మాట్లాడుతూ, భారతదేశంలోనే ఈవీ, ఆటోమొబైల్, హెల్త్కేర్, స్మార్ట్ మీటరింగ్ రంగాలకు అవసరమైన పీసీబీలు (PCB), కాపర్ క్లాడ్ లామినేట్స్ (CCL), ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (EMS) ఉత్పత్తుల తయారీ కోసం తిరుపతి జిల్లా నాయుడుపేటలో భారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
దాదాపు రూ.1,595 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను నిర్మించనున్నామని, దీని ద్వారా 2,170 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనలను సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని టేహూ కిమ్ పేర్కొన్నారు.
ఈ సమావేశం ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి మరింత ఊతం లభించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ హబ్గా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యానికి మరో ముందడుగు పడినట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Be the first to react
