YouTube: తెలుగు సినిమా కి దక్కిన అరుదైన గౌరవం.. బాక్సాఫీస్ వద్ద నిరాశ.. యూట్యూబ్లో ప్రపంచ రికార్డు!
YouTube: ఒకప్పుడు థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన తెలుగు సినిమా.. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అరుదైన రికార్డు సృష్టించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'జయ జానకి నాయక' సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ 'ఖూన్కార్' యూట్యూబ్లో ఏకంగా 100 కోట్ల (1 బిలియన్) వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించింది.
100 కోట్ల వ్యూస్తో చరిత్ర సృష్టించిన 'జయ జానకి నాయక'..
యూట్యూబ్లో తొలి 1 బిలియన్ వ్యూస్ సాధించిన పూర్తి స్థాయి సినిమా..
ఒకప్పుడు థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన తెలుగు సినిమా.. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అరుదైన రికార్డు సృష్టించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'జయ జానకి నాయక' సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ 'ఖూన్కార్' యూట్యూబ్లో ఏకంగా 100 కోట్ల (1 బిలియన్) వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే యూట్యూబ్లో ఈ ఘనత సాధించిన తొలి పూర్తి స్థాయి సినిమా ఇదే కావడం విశేషం.
దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం 2017లో విడుదలైంది. అనంతరం 2019 ఫిబ్రవరిలో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ Pen Movies ఈ చిత్రాన్ని 'ఖూన్కార్' పేరుతో హిందీలో విడుదల చేసింది. అప్పటి నుంచి ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటూ తాజాగా 1 బిలియన్ వ్యూస్ మైలురాయిని చేరుకుంది.
ఈ అరుదైన విజయంపై దర్శకుడు బోయపాటి శ్రీను ఆనందం వ్యక్తం చేశారు. "1 బిలియన్ వ్యూస్... 1000 మిలియన్ హృదయాలు... 100 కోట్ల భావోద్వేగాలు... ఈ అద్భుత ఘనత సాధించిన ప్రపంచంలోని తొలి సినిమా 'జయ జానకి నాయక'. ఈ విజయాన్ని సాధ్యంచేసిన ప్రతి ప్రేక్షకుడికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మీ అందరి ప్రేమకు గుర్తు" అంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా స్పందించారు.
ఈ సందర్భంగా సినిమా అభిమానులు కూడా చిత్రంలోని ప్రముఖ డైలాగ్లను గుర్తు చేసుకుంటూ దర్శకుడికి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్లో ఇదే రికార్డును ముందుగా అందుకునే అవకాశం ఉన్నప్పటికీ, భారీ వ్యూస్ సాధించిన పాత వీడియో తొలగించి మళ్లీ కొత్తగా అప్లోడ్ చేయడంతో ఆ అవకాశం చేజారినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
'జయ జానకి నాయక' చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్తో పాటు జగపతి బాబు, శరత్ కుమార్, తరుణ్ అరోరా, ప్రజ్ఞా జైస్వాల్, నందు, సుమన్, జయప్రకాశ్, వాణి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అయితే విడుదల సమయంలో ఈ సినిమాకు విమర్శకుల నుంచి పెద్దగా ప్రశంసలు రాలేదు. సుమారు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.20 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. దీంతో పంపిణీదారులకు రూ.8 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అప్పట్లో నివేదికలు వెల్లడించాయి.
అయినా కాలక్రమంలో ఈ సినిమాకు కొత్త జీవం లభించింది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్లో ఉత్తర భారత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో థియేటర్లలో ఫ్లాప్గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ వేదికపై ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషంగా మారింది. తెలుగు డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ ద్వారా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి భారీ ఆదరణ పొందుతున్నాయనే విషయాన్ని ఈ ఘనత మరోసారి రుజువు చేసింది.
ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న 'అఖండ 2: తాండవం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల విడుదలైన 'పతి పత్నీ ఔర్ వో 2' చిత్రంలో నటించగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా 'కిష్కింధపురి' సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.