Chandrababu: సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం!
Chandrababu: రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, అమరావతి నిర్మాణ ప్రాజెక్టులకు ఊతం కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.
అమరావతి అభివృద్ధి.. రాష్ట్ర పెట్టుబడుల కోసం చంద్రబాబు కీలక భేటీలు..
సింగపూర్ వేదికగా ఏపీకి భారీ పెట్టుబడుల ఆకర్షణకు సీఎం ప్రయత్నం..
అమరావతి: రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, అమరావతి నిర్మాణ ప్రాజెక్టులకు ఊతం కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సీఎం బృందం కీలక సమావేశాలు నిర్వహించనుంది.
జూన్ 14వ తేదీ ఉదయం 11.35 గంటలకు బెంగళూరు నుంచి సీఎం సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. పర్యటన ప్రారంభమైన తర్వాత జూన్ 15న సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో మొదటి సమావేశం నిర్వహిస్తారు.
తొలిరోజు స్టార్టప్లు, వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్తో విందు సమావేశంలో పాల్గొంటారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ ఏపీఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్, వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్లతో సీఎం చర్చలు జరపనున్నారు.
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోం మంత్రి కె షణ్ముగమ్, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్లతో కూడా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు. అలాగే సీఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించనున్నారు.
రెండో రోజు జూన్ 16న కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని సీబీఎన్@361 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం ఏపీఏసీ సెమికండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అమరావతి ప్రణాళికలకు సంబంధించి సుర్బానా జురాంగ్ సంస్థతో సమావేశం నిర్వహించనున్నారు.
తర్వాత సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో భేటీ అవుతారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో ప్రసంగించడంతో పాటు ఎగ్జిబిషన్ను సందర్శించనున్నారు. సింగపూర్ పెవిలియన్, ఇన్నోవేటర్ల అలయ్, గూగుల్ టెక్నాలజీస్ స్టాల్స్ను పరిశీలించనున్నారు.
అలాగే సీట్రియమ్ సమావేశం, సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో కూడా సీఎం పాల్గొంటారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఈడీబీ సీఈఓ షణ్మోహన్, సీఆర్డీఏ అధికారుల బృందం పాల్గొననుంది.
రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడం, రాజధాని అమరావతి అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంచడం లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. జూన్ 16వ తేదీ రాత్రి 10 గంటలకు సీఎం చంద్రబాబు స్వదేశానికి తిరిగి రానున్నారు.
Be the first to react