⚡ BREAKING

Japan Earthquake: సునామీ హెచ్చరికల వేళ జపాన్ అతలాకుతలం: రైళ్ల రాకపోకలు బంద్.. ఆరు జిల్లాల్లో కరెంట్ కట్!

Japan Earthquake: జపాన్‌లోని దక్షిణ ప్రాంతాన్ని మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం వణికించింది. క్యుషు ద్వీపంలోని కుమమోటో ప్రిఫెక్చర్‌లో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ వెంటనే తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

సునామీ హెచ్చరికల వేళ జపాన్ అతలాకుతలం
సునామీ హెచ్చరికల వేళ జపాన్ అతలాకుతలం
  • World: జపాన్‌లోని కుమమోటోలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం..

  • క్వుషు ద్వీపంలోని కుమమోటో సమీపంలో భూకంప కేంద్రం..

Japan Earthquake: జపాన్‌లోని దక్షిణ ప్రాంతాన్ని భారీ భూకంపం వణికించింది. జపాన్‌కు చెందిన ప్రముఖ క్యుషు ద్వీపంలోని కుమమోటో ప్రిఫెక్చర్‌లో మంగళవారం మధ్యాహ్నం సంభవించిన ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతగా నమోదయ్యాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన జపాన్ వాతావరణ సంస్థ (JMA) తక్షణమే తీరప్రాంత ప్రజలకు సునామీ హెచ్చరికలను (Tsunami Warnings) జారీ చేసింది.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్న సమయంలో సంభవించిన ఈ భూకంప కేంద్రం కుమమోటో నగర సమీపంలో, భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తక్కువ లోతులో భూకంపం రావడంతో ప్రకంపనల తీవ్రత అధికంగా ఉంది. అరియాకే, యత్సుషిరో సముద్ర తీర ప్రాంతాలలో సుమారు ఒక మీటర్ (దాదాపు 3 అడుగుల) ఎత్తులో వినాశకర అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఆయా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ తక్షణమే ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విపత్తు నిర్వహణ శాఖ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

ఈ తీవ్ర ప్రకంపనల ధాటికి కుమమోటో పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రసిద్ధ 'షింకన్సెన్' బుల్లెట్ రైళ్లతో పాటు అన్ని ప్రధాన రైలు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యుషు ద్వీపంలోని కుమమోటో, నాగసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఒయిటా, మియాజాకి ప్రాంతాలకు జపాన్ ప్రభుత్వం అత్యవసర భూకంప హెచ్చరికలను వర్తింపజేసింది.

భౌగోళికంగా 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటం వల్ల జపాన్‌లో ప్రతి ఏటా వందలాది భూకంపాలు నమోదవుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చే అతిపెద్ద భూకంపాలలో దాదాపు 18 శాతం కేవలం జపాన్ పరిధిలోనే చోటుచేసుకుంటాయి. సాధారణంగా ఇవి స్వల్ప తీవ్రతతో ముగిసినప్పటికీ, కొన్నిసార్లు అపార ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగిస్తుంటాయి. గతంలో 2011లో సంభవించిన 9.0 తీవ్రత వినాశకర భూకంపం, తదనంతరం వచ్చిన సునామీ కారణంగా సుమారు 18,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇప్పటికీ మరువలేనిది. ఈ ఏప్రిల్‌లో కూడా జపాన్ ఉత్తర ప్రాంతంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, తాజాగా దక్షిణ ప్రాంతంలో మరోసారి 7.1 తీవ్రత నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.

Tags

Be the first to react

Latest