ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల ఉద్యోగాల భవిష్యత్తు గురించి ఒక కీలక వ్యాఖ్య చేశారు. కృత్రిమ మేధస్సు (AI) వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయానికి భిన్నంగా, మరొక పెద్ద సమస్య ప్రపంచం ఎదుర్కొంటుందని చెప్పారు. ఫోర్డ్ కంపెనీ సీఈవో జిమ్ ఫార్లే ఇచ్చిన ఇంటర్వ్యూను ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.
మహీంద్రా చెప్పినదేమిటంటే, అమెరికాలో ప్లంబింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్ వంటి నైపుణ్య రంగాల్లో పది లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫోర్డ్ కంపెనీలోనే 5,000కు పైగా మెకానిక్ పోస్టులు భర్తీ కావడం లేదని ఫార్లే వెల్లడించారని తెలిపారు. ముఖ్యంగా ఈ ఉద్యోగాలలో కొన్ని సంవత్సరానికి 1 కోటి రూపాయలకుపైగా వేతనం ఉన్నా కూడా అర్హులైన అభ్యర్థులు లేరని విషయం ఆయన్ను ఆశ్చర్యపరిచిందని చెప్పారు.
మన సమాజం దశాబ్దాలుగా డిగ్రీలు, వైట్ కాలర్ ఉద్యోగాలపైనే దృష్టి పెట్టి, నైపుణ్య ఆధారిత శ్రామిక శక్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మహీంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్యోగాలను యంత్రాలు లేదా AI భర్తీ చేయలేవు కాబట్టి, శిక్షణ, అనుభవం, నేర్పు, మానవ తీర్పు అవసరమని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ రంగాల్లో భవిష్యత్తులో భారీ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
రాబోయే ఏఐ యుగంలో, సమాజాన్ని నిర్మించగలిగే, మరమ్మత్తు చేయగలిగే, నడిపించగలిగే నైపుణ్యం ఉన్న వ్యక్తులకే పెద్ద స్థానం ఉంటుందని ఆయన హెచ్చరించారు. కేవలం డిగ్రీలు, డెస్క్ జాబ్‌లు మాత్రమే చూసే వారు వెనుకబడతారని స్పష్టంగా చెప్పిన ఆయన, యువత నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా చేసిన హెచ్చరిక ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌పై కొత్త దృష్టికోణాన్ని చూపుతోంది. AI వల్ల ఉద్యోగాలు పోతాయనేది నిజమైనప్పటికీ, నైపుణ్య రంగాల్లో ఉన్న భారీ ఖాళీలు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అసలైన సంక్షోభమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యి, ఉద్యోగ భవిష్యత్తు, నైపుణ్యాల ప్రాధాన్యతపై విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.