రాజకీయ ముసుగులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్మాదపు చర్యలకు దిగుతున్నారని రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టినరోజు వేడుకల పేరుతో సమాజంలో హింసాత్మక, హానికర సంప్రదాయాలను ప్రోత్సహించడం అత్యంత గర్హనీయమని ఆమె పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా జగన్ ఫ్లెక్సీల వద్ద మేకలను బలివ్వడం, రక్తాభిషేకాలు చేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు. ఇవన్నీ యాదృచ్ఛిక ఘటనలు కాదని, ఒక వ్యవస్థీకృత నేర ధోరణిగా కనిపిస్తున్నాయని ఆమె ఆరోపించారు.
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడుతూ… సాధారణంగా పుట్టినరోజులు సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సంప్రదాయమని గుర్తుచేశారు. అన్నదానం, రక్తదానం, పేదలకు ఆహారం పంపిణీ చేయడం, ఆలయాల్లో పూజలు నిర్వహించడం లాంటి సత్కార్యాలు చేయాల్సిన చోట, వైసీపీ శ్రేణులు రౌడీయిజానికి బలాన్ని చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేక్ కట్ చేయడానికి చిన్న ప్లాస్టిక్ కత్తి వాడటం మన సంస్కృతి అయితే, వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్ళు, పెద్ద కత్తులతో కేక్ కట్ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. “రప్పా రప్పా అని నరుకుతాం… 2029లో ఇదే రిపీట్” అంటూ నినాదాలు చేయడం వారి నేరపూరిత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు.
కళ్యాణదుర్గం, ఉరవకొండ, సింగనమల, రాప్తాడు, కుప్పం సహా 10కి పైగా నియోజకవర్గాల్లో ఒకే రోజు, ఒకే తరహాలో జంతు బలులు, రక్తాభిషేకాలు జరగడం వెనుక జగన్ ఆదేశాలే ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయని అనిత వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులు పక్కనే నిలబడి ప్రోత్సహిస్తుండగా, కార్యకర్తలు మేకల తలలు నరికిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం అత్యంత దారుణమని అన్నారు. పండుగల పేరిట టపాసులు కాల్చడాన్ని ఆపమని కోరిన ఓ గర్భిణీ మహిళను కడుపుపై తన్నడం వంటి ఘటనలు వైసీపీ శ్రేణుల ఉన్మాదానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు.
వైసీపీ శ్రేణులు చేసే ఈ అరాచక చర్యలను వారి నాయకుడు జగన్ ఒక్క మాటతోనైనా ఖండించకపోవడం దారుణమని అనిత తీవ్రంగా తప్పుబట్టారు. “ఆస్తి కోసం సొంత తల్లి, చెల్లెలిపైనే కేసులు పెట్టిన వ్యక్తి… మీ పిల్లల భవిష్యత్తును కాపాడతాడా?” అంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని స్పష్టం చేసిన ఆమె, శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు. కత్తులు, కొడవళ్ళతో తిరిగే ఉన్మాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, రౌడీయిజానికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. “గీత దాటితే కటకటాలే… రప్పా రప్పా అంటే రిమాండ్ తప్పదు” అంటూ హోం మంత్రి అనిత ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.