ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనకు సంబంధించి డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పలు కీలక సూచనలు చేశారు.
ఇప్పటికే నవంబర్ 27న జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైంది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు తెలపడానికి నెల రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువు డిసెంబర్ 27తో ముగియగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అభ్యంతరాలను ప్రభుత్వం సవివరంగా పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులతో తుది నిర్ణయం తీసుకోనుంది.
పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మదనపల్లె, పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ మార్పులు ప్రజల సౌలభ్యం, పరిపాలనా సమర్థతను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
కొన్ని ప్రాంతాల జిల్లా మార్పులపై కూడా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. రాజంపేటను వైఎస్సార్ కడప జిల్లాలో కలపడం, రాయచోటిని మదనపల్లె జిల్లాలో చేర్చడం వంటి ప్రతిపాదనలపై చర్చించారు. అలాగే కురిచేడు, దొనకొండలను మార్కాపురం జిల్లాలో, పొదిలిని ప్రకాశం జిల్లాలో కలపాలనే అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. రైల్వే కోడూరు, గూడూరు వంటి ప్రాంతాల జిల్లా అనుసంధానాలపై కూడా పరిశీలన సాగుతోంది.
మంత్రివర్గ ఉపసంఘం నివేదికను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కేబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత డిసెంబర్ 31న జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నిర్ణయంతో పరిపాలన మరింత ప్రజలకు చేరువవుతుందని, అభివృద్ధి వేగం పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.