ముంబయి నుంచి దుబాయ్‌కు కేవలం రెండు గంటల్లో ప్రయాణించే అవకాశం త్వరలోనే వాస్తవంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 1,900 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గాన్ని విమానంలోనే ఎక్కువ సమయం పడుతోంది. అయితే, హై స్పీడ్ అండర్‌వాటర్ ట్రైన్ ద్వారా ఈ దూరాన్ని కేవలం 120 నిమిషాల్లో పూర్తి చేయాలన్న ప్రతిపాదన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్ అమలైతే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు రానుంది.
భారత్ – యూఏఈ దేశాలను కలుపుతూ అరేబియా సముద్రం అడుగున ఈ ప్రత్యేక రైలు మార్గాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఈ హై స్పీడ్ ట్రైన్‌కు “డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్” అనే పేరు ప్రచారంలో ఉంది. గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది చాలా విమానాల కంటే కూడా వేగంగా ఉండడం విశేషం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.
ఈ రైలు ప్రయాణం కేవలం వేగానికే కాదు, అనుభూతికీ ప్రత్యేకంగా ఉండనుంది. సముద్ర మట్టానికి సుమారు 200 మీటర్ల లోతులో టన్నెల్ నిర్మించి, అందులో విశాలమైన గాజు కిటికీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రయాణికులు సముద్రంలో ఈదే చేపలు, తిమింగలాలు, సొరచేపలను ప్రత్యక్షంగా చూస్తూ ప్రయాణించగలుగుతారు. ప్రపంచంలోనే అతిపొడవైన ఆక్వేరియంలో సూపర్ ఫాస్ట్ ట్రైన్‌లో ప్రయాణించిన అనుభూతి కలగనుంది.
ఈ అండర్‌వాటర్ ట్రైన్ ప్రాజెక్ట్ వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకటి – ప్రయాణ సమయం భారీగా తగ్గడం. రెండోది – భారత్ నుంచి దుబాయ్‌కు చమురు, మంచినీటి సరఫరాను మరింత సులభతరం చేయడం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 50 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు అవుతుందని, దాదాపు 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికలు ఖరారు కాకపోయినా, భారత్ – యూఏఈ దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ అమలైతే ముంబయి ప్రపంచ స్థాయి రవాణా కేంద్రంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ప్రయాణ ఖర్చులు సుమారు 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రవాణా రంగంలో ఇది చారిత్రక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది.