ఆంధ్రప్రదేశ్ మాజీ వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్టు ఆరోపిస్తున్న మద్యం స్కాంలో ఇవాళ పెద్ద ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. స్కాం నిందితులు దాచిన భారీ మొత్తంలో డబ్బును ఒడిశాకు చెందిన దొంగల ముఠా దొంగతనం చేసినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాక, ఆ దొంగలు ఈ డబ్బుతో స్తిరాస్తులు కూడా కొనుగోలు చేసినట్లు అధికారులకు ఆధారాలు లభించాయి. దీంతో ఈ కేసులో నిందితులతో పాటు ఒడిశా గ్యాంగ్‌ను కూడా పోలీసులు రాడార్‌లోకి తీసుకున్నారు.
మద్యం అమ్మకాల వ్యవహారాల్లో కీలకంగా ఉన్న నిందితులలో రాజ్ కెసిరెడ్డి (A1), కిరణ్ కుమార్ రెడ్డి (A9) లాంటి వ్యక్తులు స్కాం డబ్బులను రహస్య ప్రదేశాల్లో పెట్టెల్లో దాచినట్లు విచారణలో తేలింది. ఈ డబ్బును దాచిన ఇళ్లలో ఒకటి A44 మోహన్ కొల్లిపురి ఇంటి అని పోలీసులు గుర్తించారు. అప్పట్లో అతని అన్న అనిల్ కుమార్ హైదరాబాదులో చికిత్స కోసం అక్కడే ఉంటూ వచ్చారు. ఈ సమయంలోనే సంఘటనకు సంబంధించిన కీలక వ్యక్తులు ఒకేచోట ఉన్న పరిస్థితి ఏర్పడింది.
అనిల్ ప్రియురాలు రష్మిత బెహరా (ఒడిశా) తరచూ ఆ ఇంటికి వచ్చేది. ఆమె అక్కడ పెద్ద మొత్తంలో డబ్బు పెట్టెల్లో దాచినట్టుగా గమనించి తన ఒడిశా ఫ్రెండ్ ఇర్షాద్‌కు సమాచారం ఇచ్చింది. తర్వాత ఇర్షాద్, ముబారక్ అలీతో కలిసి మొత్తం ఆరుగురు కలిసి 5.8 కోట్ల రూపాయలను దొంగలించారు. దొంగలు డబ్బు పెట్టెలను తీసుకెళ్లి అందులో కొంత భాగం ముబారక్ అలీ ఇంట్లో దాచగా, మిగిలిన డబ్బుతో రష్మిత, ఇర్షాద్ ఒడిశాకు పారిపోయారు.
డబ్బు దొంగిలించబడిన తర్వాత అసలు స్కాం నిందితులు సైమన్ ప్రసన్న, మోహన్‌లు తమ విలువైన బంగారం, ఆస్తులు తాకట్టు పెట్టించి కొంత మొత్తాన్ని తిరిగి పొందినట్లు సమాచారం. తాజాగా అనిల్ కుమార్ విచారణలో ఈ మొత్తం దొంగతనం వ్యవహారం వెలుగులోకి తెచ్చాడు. ముఖ్యంగా దొంగలు ఈ డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేశారని చెప్పడంతో సిట్ ఇప్పుడు ఆ ప్రాపర్టీలను జప్తు చేయడానికి చర్యలు ప్రారంభించింది.
ఇలా మద్యం స్కాం డబ్బులు అసలు నిందితుల నుండి బయటకు వెళ్లి దొంగల చేతుల్లో పడి, ఆ తర్వాత స్తిరాస్తులుగా మారడం దర్యాప్తును మరింత క్లిష్టతరం చేసింది. ఈ కేసులో కొత్త కోణం బయటపడడంతో సిట్ ఇప్పుడు స్కాం నిందితులు మాత్రమే కాకుండా ఒడిశా ముఠా సభ్యులపై కూడా విచారణను వేగవంతం చేసింది.