ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ముఖ్యంగా, విజయనగరం జిల్లా గుర్ల మండలం కెళ్లలో సూపర్ స్మెల్టెర్స్ లిమిటెడ్ సంస్థ భారీ స్థాయిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వం 1,085 ఎకరాల భూమిని కేటాయిస్తూ సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. 2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో వచ్చే ఈ స్టీల్ ప్లాంట్ కోసం రూ.8,570.50 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించబడింది. అదనంగా టౌన్‌షిప్ కోసం 97.04 ఎకరాలు, రైల్వే సైడింగ్ ఏర్పాటుకు 53.35 ఎకరాలు కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనుండగా, నిర్మాణం పూర్తయిన తర్వాత స్థానికంగా సుమారు 750 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
ఈ భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే స్థానిక ప్రజలకు ఉద్యోగాలు పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ సదస్సు ద్వారా మొత్తం రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని, 16 లక్షల మందికి ప్రత్యక్ష–పరోక్ష ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులను రప్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే ఫలితం ఇస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన 20 లక్షల ఉద్యోగాల కల్పన వైపు ప్రభుత్వం దృఢంగా అడుగులు వేస్తోందని మంత్రి అన్నారు. సదస్సులో ప్రకటించబడుతున్న పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలు ఏర్పడితే రవాణా, నిర్మాణం, సేవల రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు. దీంతో జిల్లాలో వలసలు తగ్గి, యువతకు స్వస్థలంలోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న విమర్శలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టించుకోనవసరం లేదన్నారు. గత ప్రభుత్వం కాలంలో జరిగిన సీఐఐ సదస్సుతో ప్రస్తుత సదస్సుకు చాలా తేడా ఉందని, ఈసారి వచ్చిన పెట్టుబడులు వాస్తవికంగా అమలు దిశగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధి అంటే కేవలం పెట్టుబడులు మాత్రమే కాకుండా, వాటి వల్ల వచ్చే ఉపాధి అవకాశాలు, ప్రాంతాల అభివృద్ధి కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు.