బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు పెద్ద నిరాశ ఎదురైంది. ఆయన స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 243 సీట్లలో 238 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. మొదట లెక్కింపు ప్రారంభమైనప్పుడు నాలుగు చోట్ల ఆధిక్యంలో కనిపించినా, చివరికి అన్ని స్థానాల్లో ఓటమి చవిచూసింది.
బీజేపీ నేత అమిత్ మాల్వీయా దీనిపై ఎక్స్ (మునుపటి ట్విట్టర్) లో స్పందిస్తూ జన్ సురాజ్ పార్టీ 238 మంది అభ్యర్థుల్లో 236 మంది కూడా డిపాజిట్ కోల్పోయారు అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు కనీసం గెలిచిన అభ్యర్థి ఓట్లలో ఆరు వంతు కూడా సాధించలేకపోతే రూ.10,000 డిపాజిట్ కోల్పోవాలి. జన్ సురాజ్ అభ్యర్థులు ఎక్కువగా నాలుగో లేదా అంతకంటే దిగువ స్థానాల్లో నిలిచారు. 61 స్థానాల్లో అయితే NOTA కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చాయి.ఓటు శాతం కూడా చాలా తక్కువ.
మొత్తం పోలైన ఓట్లలో జన్ సురాజ్ పార్టీకి 3.34% మాత్రమే వచ్చింది. కానీ ఎన్నికల ముందు వచ్చిన కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ పార్టీ 8–10% వరకు ఓట్లు సాధిస్తుందని అంచనా వేశాయి. చివరికి ఆ అంచనాలు తప్పాయి.
ఇక పెద్ద పార్టీల విషయానికొస్తే బీజేపీ, జేడీయూలతో కూడిన NDA బ్లాక్ బంగారు విజయాన్ని సాధించింది. 243 సీట్లలో 202 సీట్లు వారి ఖాతాలో పడ్డాయి.
మరోవైపు ఆర్జేడీ – కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్ కేవలం 35 సీట్లు మాత్రమే గెలిచింది. 2020లో ఈ కూటమికి 110 సీట్లు వచ్చాయి. ఈసారి అది భారీగా తగ్గింది. ఆర్జేడీకి గతసారి 75 సీట్లు ఉండగా ఈసారి 25 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్‌కు 19 నుంచి 6 సీట్లకు తగ్గింది. NDA పక్షాన బీజేపీ 89 సీట్లు గెలుచుకుంది.
2020లో 74 ఉండగా ఈసారి 15 పెరిగాయి. జేడీయూ కూడా 2020లో 43కి పడిపోయినప్పటికీ ఈసారి బలంగా తిరిగి వచ్చి 85 సీట్లు సాధించింది.నవంబర్ 20న నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నిక ఓటింగ్ రెండు దశల్లో – నవంబర్ 6, 11 తేదీల్లో జరిగింది. రికార్డు స్థాయిలో 66% ఓటింగ్ నమోదైంది.
జన్ సురాజ్ పార్టీ తమ ఓటమికి ప్రభుత్వాన్ని కారణంగా చూపుతోంది. ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన రూ.14,000 కోట్లు ప్రభుత్వ ప్రచారానికి మళ్లించారని ఆరోపించింది. అలాగే ఎన్నికల ముందు ఉచిత పథకాలు పెన్షన్ పెంపు వంటివాటితో ఓటర్లను ప్రభావితం చేశారని పార్టీ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ అన్నారు. ప్రశాంత్ కిశోర్‌కు ఈ ఫలితాలు పెద్ద దెబ్బగా మారాయి. ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.