భారత ప్రభుత్వంలోని కేబినెట్ సెక్రటేరియట్ దేశవ్యాప్తంగా యువతకు పెద్ద అవకాశాన్ని అందించింది. గ్రూప్–బి (నాన్ గెజిటెడ్) కేటగిరీలోకి వచ్చే డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్న ఈ నియామకాల్లో, అభ్యర్థులను పూర్తిగా గేట్ 2023, 2024 లేదా 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు 2025 డిసెంబర్ 14 లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నేరుగా నిర్వహించే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ భద్రత లభిస్తుంది.
ఈ పోస్టుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ విభాగంలో అత్యధికంగా 124 ఖాళీలు ఉండగా, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ విభాగంలో 95 పోస్టులు ఉన్నాయి. డేటా సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 10, ఫిజిక్స్‌లో 6, కెమిస్ట్రీలో 4, గణితంలో 2, స్టాటిస్టిక్స్‌లో 2, జియోలజీలో 3, సివిల్ మరియు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో తలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు దేశ భద్రత, సాంకేతిక పరిశోధనలకు సంబంధించి ఉండటం వల్ల సముచిత సాంకేతిక పరిజ్ఞానం, విశ్లేషణాత్మక నైపుణ్యాలు కలిగిన యువతకు ఇది మంచి అవకాశం.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా పై పేర్కొన్న సబ్జెక్టుల్లో ఏదైనా ఒకటిలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే గేట్ స్కోర్ కలిగి ఉండటం తప్పనిసరి. ప్రభుత్వ నియమాల ప్రకారం అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు మించరాదు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రత్యేకమైనది. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తును పూరించి, న్యూఢిల్లీ లోని లోధీ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి. తుది ఎంపిక గేట్ స్కోర్ + ఇంటర్వ్యూ + సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది.
ఎంపికైన వారికి నెలకు రూ. 99,000 వరకు వేతనం లభించనుంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అలవెన్స్‌లు, ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. త్వరలో విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌లో అభ్యర్థులు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌లు అందుబాటులో ఉంటాయి. దేశ భద్రత, టెక్నాలజీ రంగంలో కీలకంగా ఎదగాలనుకునే యువతకు ఈ నోటిఫికేషన్ గొప్ప ఛాన్స్‌గా భావిస్తున్నారు.