ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం అభివృద్ధి దిశగా మరొక కీలక అడుగు పడింది. గురువారం ఉదయం కర్ణాటక భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న కొత్త కంబి మండపం మరియు 200 గదులతో కూడిన యాత్రికుల వసతి సముదాయం నిర్మాణ పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు. జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిజీ ఆశీర్వాదాలతో, భూమిపూజ కార్యక్రమాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు కలిసి నిర్వహించారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక వసతి సదుపాయాలతో కూడిన ఈ ప్రాజెక్టు శ్రీశైలం అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది.
సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కంబి మండపం యాత్ర నివాస్, భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతి అందించడమే కాదు, శ్రీశైలానికి వచ్చే కర్ణాటక భక్తుల కోసం ప్రత్యేక సేవలను సమకూర్చేందుకు రూపొందించబడింది. పీఠాధిపతి చిన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ నిర్మాణం, పుణ్యక్షేత్రానికి వచ్చే రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రణాళికలో భాగమని అధికారులు తెలిపారు. అర్చకులు, పీఠాధిపతి, ఎమ్మెల్యే, దేవస్థానం చైర్మన్ అందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది.
కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీశైలం అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఈగలపెంట నుండి శ్రీశైలానికి రోప్‌వే ప్రాజెక్టు ప్రారంభం కానుందని తెలిపారు. ఇది అమలులోకి వస్తే పాదయాత్రికులకు, భక్తులకు కొత్త మార్గంగా, పర్యాటక అభివృద్ధికి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. భక్తుల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, శ్రీశైలానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అంతేకాక, ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మాట్లాడి శ్రీశైలానికి సంబంధించిన అటవీ భూముల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అటవీ భూముల క్లియరెన్స్ లభిస్తే, శ్రీశైలం ప్రాంతం ఇంకా విస్తృతంగా అభివృద్ధి చెందుతుందని, యాత్రికులకు మరిన్ని సదుపాయాలు అందే అవకాశం ఉందని చెప్పారు. భవిష్యత్‌లో శ్రీశైలాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.