నిద్రలేమి (ఇన్సోమ్నియా) (Insomnia) అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సాధారణ అనారోగ్యం సమస్య. సరైన నిద్ర లేకపోతే శరీరానికే కాదు, మనసుకూ అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని చిన్న కానీ ప్రభావవంతమైన అలవాట్లు పాటిస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. దీనివల్ల మన శరీరంలోని బయోలాజికల్ క్లాక్ సరిగ్గా పని చేసి సహజంగా నిద్ర పట్టే అవకాశం పెరుగుతుంది. అలాగే బెడ్రూమ్ వాతావరణం కూడా నాణ్యమైన నిద్రకు కీలకం. గది ఉష్ణోగ్రత 18 నుంచి 22 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి.
ఎక్కువ వేడి లేదా ఎక్కువ చలి రెండూ నిద్రను భంగపరుస్తాయి. గదిలో లైటింగ్ మితంగా ఉండాలి. ఎక్కువ కాంతి మెదడును అప్రమత్తంగా ఉంచి నిద్రను దూరం చేస్తుంది. అందుకే సాఫ్ట్ లైట్ లేదా పూర్తిగా చీకటి వాతావరణం నిద్రకు మంచిది. ఇకపోతే కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, కోల్డ్ డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్‌ను సాయంత్రం తర్వాత తీసుకోకపోవడం మంచిది. ఇవి నరాలను ఉత్తేజపరిచి నిద్ర రాకుండా చేస్తాయి. శరీరానికి అవసరమైన విటమిన్ D, B12 లాంటి పోషకాలు లోపించకుండా చూసుకోవడం కూడా ముఖ్యం.
వీటి లోపం అలసట, నిద్ర సమస్యలకు దారితీస్తుంది. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. మరో ముఖ్యమైన అలవాటు ఏమిటంటే రేపటి పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం. పడుకునే ముందు మనసులో పనుల గురించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటే నిద్ర పట్టడం కష్టమవుతుంది. కాబట్టి టు-డూ లిస్ట్ రాసుకుని, మనసుకు ప్రశాంతత కలిగేలా చేసుకోవాలి.
అంతేకాదు, పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్ లాంటి స్క్రీన్లను ఎక్కువసేపు ఉపయోగించకపోవడం మంచిది. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడును చురుకుగా ఉంచుతుంది. తేలికపాటి యోగా, ధ్యానం లేదా పుస్తక పఠనం లాంటి అలవాట్లు నిద్రను ఆహ్వానిస్తాయి. మొత్తానికి చిన్న చిన్న మార్పులు చేసి క్రమశిక్షణగా పాటిస్తే నిద్రలేమి సమస్యను సులభంగా జయించవచ్చు. ఆరోగ్యకరమైన నిద్రే ఆరోగ్యకరమైన జీవితానికి మూలమని గుర్తుంచుకోవాలి.