ఇండియాలో చాలామందికి అన్నం పూర్తిగా తినకుండా వదిలేయడం ఇష్టం ఉండదు. భోజనం అంటే కూరన్నం, సాంబారన్నం, రసం అన్నం, పెరుగన్నం అన్నీ కలిపి ఫుల్ మీల్స్‌గా తినాల్సిందే అనే భావన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, వేడుకలు, హోటళ్లలో అయితే ఇంకా ఎక్కువగా తినే అలవాటు కనిపిస్తుంది. ఇక బిర్యానీ ప్రియుల విషయానికి వస్తే చెప్పాల్సిన పనిలేదు. చికెన్ ఫ్రై పీస్, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దొజ్జె బిర్యానీ, మండీ బిర్యానీ అంటూ ఒక పెద్ద ప్లేట్ ముందుకు వస్తే ఒక్క ముక్క కూడా మిగలకుండా తినేయడం చాలామందికి అలవాటు. తిన్నంత తిన్నాకే తృప్తి అన్న భావన మనలో బలంగా ఉంది. ఈ అలవాట్లే క్రమంగా శరీర బరువు పెరగడానికి, ఊబకాయం సమస్యకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. జపాన్‌లో అన్నాన్ని పూర్తిగా మానేయరు. కానీ వారు అన్నం తినే విషయంలో చాలా క్రమశిక్షణతో, కొలతతో తింటారు. అక్కడ ఉపయోగించే రైస్ బౌల్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. సాధారణంగా జపాన్ ప్రజలు ఒక భోజనంలో 140 గ్రాముల అన్నం మాత్రమే తీసుకుంటారు. ఈ పరిమాణంలో అన్నం తింటే సుమారు 200 క్యాలరీల ఎనర్జీ మాత్రమే శరీరానికి అందుతుంది. అంటే అన్నం తిన్నా అవసరమైన శక్తి వస్తుంది కానీ అధిక క్యాలరీలు శరీరంలో చేరవు. అన్నాన్ని శత్రువుగా చూడకుండా, మితంగా తీసుకోవడమే వారి ఆరోగ్య రహస్యంగా (health secret) చెప్పుకోవచ్చు.
అంతేకాదు, జపాన్ ప్రజలు (japanese people) అన్నం తినే ముందు సూప్ తాగడం ఒక అలవాటుగా పాటిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ముందు తేలికపాటి సూప్ తాగుతారు. ఇలా సూప్ తాగడం వల్ల కడుపు కొంతవరకు నిండిపోతుంది. దాంతో ఎక్కువ అన్నం తినాలనే అవసరం ఉండదు. అతిగా తినకుండా సహజంగానే నియంత్రణ వస్తుంది. ఈ చిన్న అలవాటు కూడా వారి సన్నని శరీరాకృతికి, ఆరోగ్యానికి ప్రధాన కారణంగా మారింది.
ఇంకా జపాన్ ప్రజలు స్నాక్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోరు. భోజనాల మధ్యలో చిప్స్, బర్గర్లు, ఫ్రైడ్ ఐటమ్స్ వంటి జంక్ ఫుడ్ తినే అలవాటు చాలా తక్కువ. భోజనం చేసే లోపు ఇలా స్నాక్స్ తినడం వల్ల అనవసర క్యాలరీలు శరీరంలో చేరి ఊబకాయం పెరుగుతుందని వారు తెలుసుకున్నారు. అలాగే కొవ్వు కరిగించుకోవడానికి తప్పనిసరిగా జిమ్‌లకు వెళ్లాల్సిందే అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉండదు. రోజువారీ జీవనశైలిలోనే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. నడకకు, సైక్లింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ కారణంగా శరీరంలో కొవ్వు నిల్వ అయ్యే అవకాశం తగ్గుతుంది.
ఈ అన్ని అలవాట్ల వల్లే జపాన్ ప్రజలు మూడు పూటలా అన్నం తిన్నా సన్నగా, చురుకుగా, ఆరోగ్యంగా ఉంటున్నారు. బియ్యం లేదా అన్నం ఎప్పుడూ శత్రువు కాదు. మోతాదుకు మించి, అవసరానికి మించిన పరిమాణంలో అన్నం తినడమే ఊబకాయం సమస్యకు ప్రధాన కారణం. మనం కూడా అన్నాన్ని మానేయకుండా, పరిమితంగా తినడం, భోజనంలో సమతుల్యత పాటించడం నేర్చుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు.