దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ పాత ఇంటర్వ్యూలో రాజమౌళి తన వ్యక్తిగత విశ్వాసాలు, ఆధ్యాత్మికతపై తన ఆలోచనలను స్పష్టంగా వెల్లడించారు. తాను నాస్తికుడిననే విషయాన్ని ఎలాంటి సందేహానికి తావు లేకుండా చెప్పారు. దేవుళ్లను నమ్మకపోయినా, తన తల్లిదండ్రులకు ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాన్ని గౌరవిస్తానని పేర్కొన్నారు. అయితే గుళ్లకు వెళ్లడం, ఆచారాలు, ఆరాధనలు, సంప్రదాయ కార్యక్రమాలు తనకు పెద్దగా నచ్చవని ఆయన స్పష్టం చేశారు.
ఈ వీడియోలో రాజమౌళి హిందూ ధర్మానికి సంబంధించిన నాలుగు ప్రధాన యోగాలు భక్తి యోగం, జ్ఞాన యోగం, రాజ యోగం, కర్మ యోగం గురించి మాట్లాడారు. ఈ యోగాల్లో భక్తి యోగం మాత్రమే దేవుడి ఆస్తిత్వాన్ని నమ్ముకునే మార్గమని చెప్పారు. కానీ తాను ఆ మార్గంలో లేనని, తనకు కర్మయోగం మాత్రమే దగ్గరగా అనిపిస్తుందని తెలిపారు. మనిషి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తన పనిని అంకితభావంతో చేయడమే నిజమైన కర్మయోగమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాను కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తున్నానని, ఫలితాలను పట్టించుకోకుండా శ్రమించే విధానమే తనకు జీవన ధర్మమని అన్నారు. "ఎవరైనా చూసినా చూడకపోయినా, ప్రశంసించినా చేయకపోయినా, మన పని మనం నిజాయితీగా చేయాలి. అదే కర్మయోగం" అని ఈ వీడియోలో చెప్పారు.
ఇక ఆయన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విభిన్న రకాల స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆయన ఆలోచనలను ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలపై విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే రాజమౌళి వ్యాఖ్యలు స్వంత జీవిత తత్వాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయని నెటిజన్లు చెబుతున్నారు.
ఇంతకు ముందు కూడా రాజమౌళి ఇదే తరహాలో నాస్తికత్వం, విశ్వాసం, జీవన విధానం గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన సినిమా ప్రపంచంలోనే కాకుండా వ్యక్తిగత ఆలోచనల్లో కూడా నిర్దిష్టమైన వైఖరిని పాటించడం, ధైర్యంగా స్పందించడం అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది.