దిత్వా తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగా పడుతోంది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షాలు, పిడుగులు, బలమైన ఈదురుగాలులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉన్న పాఠశాలలు, కళాశాలలు నేటి రోజు మూసివేయాలని అధికారులు స్పష్టం చేశారు.
అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసిన తాజా హెచ్చరికల్లో దిత్వా తుపాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా కడప, పశ్చిమ గోదావరి, కోనసీమ, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. తూర్పు గోదావరి, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది. వివిధ ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రత మారుతూ ఉండటంతో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలను హై అలర్ట్‌లో ఉంచింది. ముఖ్యంగా ప్రభావిత జిల్లాల్లో పునరావాసం, వైద్య సాయం, విద్యుత్ పునరుద్ధరణ, రహదారి రవాణా వంటి అత్యవసర సేవల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. హోం శాఖ మంత్రి అనిత ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 48 గంటలు కీలకమైనవని, ఈ సమయంలో అధికారులు విధుల్లోనే ఉండాలని ఆమె సూచించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సెలవులు రద్దు చేయాలని ఆదేశించగా, ప్రజల భద్రత కోసం ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రజలకు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలమైన గాలులు, చెట్లు కూలే ప్రమాదం, వరద నీరు చేరే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు. అవసరమైతే ప్రజలు సమీపంలోని సహాయక కేంద్రాలకు చేరుకోవాలని, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని సూచించారు. తుపాన్ పూర్తిగా తగ్గే వరకు అన్ని శాఖలు నిత్యం పర్యవేక్షణ కొనసాగించనున్నాయి.