దక్షిణ భారత రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారబోతున్నాయి. బంగాళాఖాతంలో శనివారం అండమాన్ దీవుల సమీపంలో కొత్తగా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న బే ప్రాంతం ఈ వ్యవస్థతో మళ్లీ చురుకుదనం సంతరించుకోనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతాన్ని చేరుకునే సమయానికి వాయుగుండం రూపం దాల్చే అవకాశాలు ఉన్నట్లు IMD అంచనా వేసింది.
ఈ వాయుగుండం మరింత బలపడుతూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాను తీవ్రత ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టమైన నివేదిక ఇంకా రాలేదు కానీ, రాష్ట్రాల వాతావరణంపై దాని ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అల్పపీడనం ఏర్పడుతుండటంతో బంగాళాఖాతం నుంచి తేమ గాలుల ప్రవాహం భారీగా పెరిగింది. ఈ తేమ గాలులు తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో శనివారం రోజున తేలికపాటి నుండి ఓమోస్తరు వర్షాలు పడతాయని అంచనా. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన చలి తీవ్రత తాత్కాలికంగా తగ్గిపోయింది. తేమ గాలుల ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటాన్ని నిపుణులు గమనించారు.
అల్లూరి సీతారామరాజు, పర్లాకిమిడి వంటి కొండ ప్రాంతాల్లో గతంలో 10–12 డిగ్రీల వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు శుక్రవారం నాటికి 13 డిగ్రీల పైకి చేరాయి. తుపాను పూర్తిగా బే నుంచి దూరమయ్యే వరకు రాష్ట్రంలో ఈ చలి తగ్గుదల కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం చెబుతోంది.
ఇక పక్క రాష్ట్రమైన తెలంగాణలో పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. శనివారం ఎలాంటి వర్షాలు ఉండకపోయినా, ఆదివారం నుంచి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
సమగ్రంగా చూస్తే, అండమాన్ సమీపంలో ఏర్పడుతున్న ఈ అల్పపీడనం రాబోయే రోజులలో తుపానుగా మారితే రాష్ట్రాలకు గాలి, వర్షాల రూపంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే వాతావరణ శాఖ తాజా సూచనలను ప్రజలు అనుసరించాలని, తీర ప్రాంతాల్లో మత్స్యకారులు, వ్యవసాయదారులు వరి కోతల సమయం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.