ఉన్నత విద్యలో నాణ్యత పెంచాలని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థులకు ఇచ్చే ‘టాప్ క్లాస్ స్కాలర్‌షిప్’ పథకానికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలనుకునే ఎస్సీ విద్యార్థులకు ఇది కీలక ఆర్థిక సహాయం అందించే పథకం. ఈ కొత్త నిబంధనలు వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి రావనున్నాయి.
ఈ పథకం లక్ష్యం ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ విద్యార్థులు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్‌ఐటీలు, నేషనల్ లా యూనివర్సిటీలు, నిఫ్ట్, ఎన్‌ఐడి, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి ప్రధాన విద్యాసంస్థల్లో ఖర్చుల గురించి ఆందోళన లేకుండా చేరడానికి అవకాశం కల్పించడం. కొత్త నిబంధనల ప్రకారం, కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయల లోపే ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులవుతారు. ముఖ్యంగా, ఈ పథకం కేవలం మొదటి ఏడాది చేరిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఒకసారి అర్హత పొందితే, వారికి కోర్సు పూర్తయ్యే వరకు పునరుద్ధరణ లభిస్తుంది, అయితే వారి విద్యా పనితీరు సంతృప్తికరంగా ఉండాలి.
ఇకపై ట్యూషన్ ఫీజు మొత్తం మరియు ఇతర తప్పనిసరి ఫీజులు నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ విధానం ద్వారా జమ అవుతాయి. ప్రైవేట్ విద్యాసంస్థలలో చదివితే, ప్రభుత్వం సంవత్సరం గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు భరించనుంది. మొదటి సంవత్సరంలో విద్యార్థులకు పుస్తకాలు, ల్యాప్‌టాప్, నివాసం, ఇతర చదువు ఖర్చులకు 86 వేల రూపాయల అదనపు భత్యం అందిస్తారు. రెండో సంవత్సరం నుండి ఈ మొత్తం 41 వేల రూపాయలుగా ఉంటుంది. అయితే ఈ స్కాలర్‌షిప్ తీసుకున్న విద్యార్థులు మరే ఇతర కేంద్రం లేదా రాష్ట్ర పథకాన్ని పొందడానికి అర్హులు కాదు.
ఒక కుటుంబంలో ఇద్దరికి మించి ఈ పథకం ప్రయోజనం ఇవ్వకూడదన్న నిబంధన కూడా అమల్లోకి వచ్చింది. అలాగే చదువుకునే సంస్థను మధ్యలో మార్చుకుంటే విద్యార్థి ఈ అవకాశం కోల్పోతాడు. ఈసారి 2024–25 విద్యాసంవత్సరానికి 4,400 కొత్త స్ధానాలు మాత్రమే ఉండగా, మొత్తం పథకం కాలంలో (2021–2026) 21,500 స్ధానాల పరిమితి ఉంది. ఈ స్ధానాల్లో 30 శాతం ఎస్సీ అమ్మాయిలకు కేటాయించబడింది. అమ్మాయిల స్ధానాలు పూర్తిగా నిండకపోతే మాత్రమే ఆ స్ధానాలు అబ్బాయిలకు ఇవ్వవచ్చు.
సామాజిక న్యాయశాఖ విడుదల చేసిన ఈ తాజా మార్గదర్శకాలు విద్యా అవకాశాలు పెంచడమే కాకుండా, విద్యాసంస్థల బాధ్యతను కూడా పెంచేలా రూపొందించబడినట్లు అధికారులు చెబుతున్నారు. మెరుగైన విద్య అందించాలనే ప్రభుత్వ విధానానికి ఈ పథకం మరో కీలక బలంగా నిలుస్తోంది.