ప్రజాస్వామ్యం ప్రతి పౌరుని చైతన్యంపై ఆధారపడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కేవలం హక్కు మాత్రమే కాకుండా, అది ఒక పవిత్రమైన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దది కావడానికి కారణం ప్రజల భాగస్వామ్యమేనని మోదీ వివరించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో 18ఏళ్లు నిండిన యువత కీలక పాత్ర పోషిస్తారని, వారిని ప్రోత్సహించడం సమాజ బాధ్యత అన్నారు.
తొలిసారి ఓటు వేసే హక్కును పొందిన యువతకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న విద్యాసంస్థల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను వేడుకలా అభినందించాలని మోదీ పిలుపునిచ్చారు. అలా చేయడం ద్వారా ప్రజాస్వామ్యం విలువలను యువత మరింత లోతుగా తెలుసుకుంటారని, దేశ భవిష్యత్తుపై వారి నమ్మకం, బాధ్యతబాధ్యత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశ అభివృద్ధి కేవలం ప్రభుత్వాలు చేసే పనులతోనే సాధ్యం కాదు, ప్రతి పౌరుడు తన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలి అని మోదీ చెప్పారు. మహాత్మా గాంధీ చెప్పిన “విధులు పాటిస్తేనే హక్కులు లభిస్తాయి” అనే సందేశాన్ని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితోనే అభివృద్ధి చెందిన, అత్యాధునిక, స్వయం సమృద్ధి కలిగిన ‘వికసిత్ భారత్’ వైపు కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
యువత శక్తి దేశానికి అత్యంత విలువైన ఆస్తి అని, వారి ప్రతిభ, ధైర్యం, సంకల్పం భారత పురోగతికి పునాది అవుతుందని మోదీ పేర్కొన్నారు. ఓటు మాత్రమే కాదు, దేశ ప్రయోజనాల కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించడం కూడా యువత కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. సామాజిక ఐక్యతను కాపాడుతూ, శాంతి సహన విలువలను పాటిస్తూ, సమాజం ఎదగడానికి పని చేయాలని సూచించారు.
రాజ్యాంగం ప్రతి భారతీయునికి సమాన హక్కులు, అవకాశాలు అందించిన గొప్ప పత్రం అని ఆయన అన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థ మనకున్నది గర్వకారణం అని, దాన్ని మరింత గౌరవించాలన్నారు. “యువత చురుకుగా ముందుకు వస్తే, భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుంది” అని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.