ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు డ్రా చేసినా నగదు బయటకు రాకపోవడంతో మిషన్ పనిచేయడం లేదని భావించి వెళ్లిపోతే, అదే కేటుగాళ్లకు అవకాశంగా మారుతుందని పోలీసులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఏటీఎం చోరీలకు రోజుకో కొత్త పద్ధతిని నేరగాళ్లు అనుసరిస్తున్నట్లు గుర్తించారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఏటీఎంలలో ఇనుప ప్లేట్లు అమర్చి నగదు చోరీ చేస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సీసీఎస్, కాజీపేట పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, ఇనుప ప్లేట్లు, నకిలీ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన నిందితులు రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందినవారిగా, పరస్పర పరిచయంతో కలిసి మద్యం సేవనానికి అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏటీఎం చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ ముఠా పాత ఎస్‌బీఐ ఏటీఎం మిషన్లలో ఉన్న లోపాలను గుర్తించి చోరీలకు పాల్పడేది. నకిలీ తాళం చెవులతో ఏటీఎం తెరిచి, నగదు బయటకు వచ్చే మార్గంలో గమ్‌తో ఇనుప ప్లేట్ అమర్చేవారు. దీంతో ఖాతాదారుడు డబ్బులు డ్రా చేసినా నగదు బయటకు రాక, మిషన్ లోపలే నిలిచిపోయేది. ఖాతాదారుడు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఏటీఎం తెరిచి నగదును దొంగిలించేవారు.
విచారణలో ఈ ముఠా దేశంలోని పలు రాష్ట్రాల్లో 40కిపైగా ఏటీఎం చోరీలు చేసినట్లు వెల్లడైంది. వరంగల్ ట్రైసిటీలోనే 7 ఏటీఎంల నుంచి రూ.12.10 లక్షలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాజీపేటలో మరో చోరీకి యత్నిస్తున్న సమయంలో నిఘా పెట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు.