బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గడంతో కొనుగోలుదారులకు శుభవార్త లభించింది. అంతర్జాతీయ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలు బలపడటంతో పాటు, వెండిపై చైనా విధించిన ఎగుమతి ఆంక్షల ప్రభావంతో విలువైన లోహాల ధరల్లో గణనీయమైన పతనం చోటుచేసుకుంది. దీంతో దేశీయ మార్కెట్లలో కూడా ధరలు దిగొచ్చాయి.
గత కొంతకాలంగా రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన వెండి ధరలు మంగళవారం భారీగా పడిపోయాయి. సోమవారంతో పోలిస్తే కిలో వెండి ధర ఏకంగా రూ.18 వేల వరకు తగ్గింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.58 లక్షలుగా ఉండగా, ముందు రోజు ఇది రూ.2.8 లక్షలకు చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.4 లక్షలుగా నమోదైంది.
వెండితో పాటు బంగారం ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. మంగళవారం ఒక్కరోజులోనే పది గ్రాముల బంగారం ధర రూ.3 వేలకుపైగా పడిపోయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,36,200గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,850గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఇదే తరహాలో తగ్గాయి. అక్కడ 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,36,350గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,000గా ఉంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు వెళ్లడం కూడా ధరలు పడిపోవడానికి ఒక కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
బంగారం, వెండి ధరలు తగ్గడంతో నగలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయంగా మారింది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ధరల తగ్గుదల మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి రానున్న రోజుల్లో ధరల్లో మరింత మార్పులు ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.